తిరుచానూరు : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం పేరుతో నకిలీ జిలేబీ తయారుచేసి విక్రయిస్తున్న పోటు కార్మికుడిను పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి పోటులో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న రమణ తిరుచానూరులోని వసంతరావునగర్‌లో ఉంటున్నాడు. శ్రీవారి ప్రసాదంలో జిలేబీలకు గిరాకీ ఎక్కువ. దాంతో అతను ఇంటివద్దే జిలేబీలు తయారుచేస్తూ తిరుమలలో చేసే విధంగానే ప్యాకింగ్ చేసి విక్రయించేవాడు.
ఈ వ్యవహారం చాలాకాలంగా కొనసాగుతోంది. భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రమణ వ్యవహారశైలిపై కన్నేశారు. గురువారం ఉదయం తిరుచానూరులోని రమణ ఇంటిపై దాడిచేసిన తిరుమల పోలీసులు రమణను అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీసులకు అప్పగించారు. ఈ సందర్బంగా పెద్దఎత్తున జిలేబీలను స్వాధీనం చేసుకున్నారు.