‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దింపనున్న పార్టీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరగనున్న ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరో సీటుకు పోటీచేయనున్నాయి. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎన్నికల్లో సీపీఐ తరఫున పువ్వాడ నాగేశ్వరరావును పోటీకి నిలపాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం మఖ్దూంభవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక నల్లగొండ స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిని పోటీకి నిలపాలని ఇటీవల జరిగిన 10 వామపక్షాల భేటీలో నిర్ణయించారు.
వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికల్లో పది వామపక్షాల తరఫున అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని పోటీకి నిలపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
బీజేపీ ప్రతిష్ట దిగజారుతోంది: సురవరం
బీజేపీ ప్రతిష్ట దిగజారడం మొదలైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే కూరుకుపోయారని, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ సీఎం అప్రతిష్ట పాలయ్యారని పేర్కొన్నారు. జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలను కార్యవర్గ భేటీలో సురవరం వివరించారు.