సంపాదకీయం
దేశంలో వామపక్షాల పలుకుబడి క్రమేపీ క్షీణిస్తున్నదన్న అభిప్రాయం బలపడుతున్న సమయంలో విశాఖపట్టణంలో సీపీఎం 21వ జాతీయ మహాసభలు ఆరురో జులపాటు కొనసాగి ఆదివారం పూర్తయ్యాయి. తాము అనుసరించిన వ్యూహం, ఎత్తుగడలూ, కార్యక్రమాలూ...వాటి సాఫల్య వైఫల్యాల గురించి చర్చించుకుని, వాటిలోని గుణదోషాలను నిర్ధారించుకుని భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహాన్ని రూపొందించుకోవడం మూడేళ్లకోసారి జరిగే ఈ మహాసభల ప్రధాన ఉద్దేశం. సీపీఎం ఆవిర్భవించి అర్థ శతాబ్ది పూర్తయిన సందర్భం కావడంవల్ల ఈ మహాసభల కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో కార్మికవర్గం నాయకత్వాన జనతా ప్రజాస్వామిక రాజ్యస్థాపనకు పూనుకోవడమే తమ ధ్యేయమని ఆవిర్భవించిన రోజున సీపీఎం ప్రకటించింది. ప్రజలను బూర్జువా భూస్వామ్య పార్టీల ప్రభావం నుంచి తప్పించాలని, వారికి బలమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలని సంకల్పిం చింది. అందుకోసం ఎన్నికల్లో సహచర వామపక్షాలతో కలిసి అడుగులేయాల నుకున్నది. ఈ ఆచరణ పర్యవసానంగా సీపీఎం సాధించిన విజయాలు గణనీయ మైనవి. కేరళలో 1957 ఎన్నికల్లో తొలిసారి ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో తొలి కమ్యూనిస్టు మంత్రివర్గం ఏర్పడింది. అటు తర్వాత మధ్య మధ్య విరామా లున్నా ఆ రాష్ట్రంలో సీపీఎం నేతృత్వాన వామపక్ష ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వాలు అధికారంలోకొస్తున్నాయి. 2011 ఎన్నికల్లో ఆ కూటమి స్వల్ప తేడాతో అధికారా నికి దూరమైంది. పశ్చిమబెంగాల్‌లో సుదీర్ఘ కాలం...1977 నుంచి 2011 వరకూ ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. త్రిపురలో 1988, 1993 ఎన్నికలు మినహా 1977నుంచీ ఆ పార్టీ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో కొనసాగుతున్నది. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అజ్ఞాతం లోకి వెళ్లిన సీపీఎం ఆ తర్వాత బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, జాతీయ స్థాయిలో ఎదగడంపై దృష్టి కేంద్రీకరించింది. 1980 దశకం తర్వాత కాంగ్రె సేతర పార్టీలతో పొత్తుపెట్టుకోవడం ప్రారంభించింది. ఈ పొత్తులవల్ల ఆ పార్టీకి కొన్ని సీట్లు లభిస్తే లభించి ఉండొచ్చుగానీ అది బలమైన శక్తిగా రూపొందలేక పోయింది. సీపీఎం జయాపజయాలు అది పొత్తు పెట్టుకునే పార్టీల గెలుపోటము లతో ముడిపడి ఉండటం దీన్నే సూచిస్తుంది. బలమైన ప్రజాపోరాటాలు నిర్మించినచోట మాత్రమే పొత్తులతో సంబంధం లేకుండా అది విజయం పొందగలిగింది.
ఇటీవలికాలంలో వామపక్షాల ప్రభావం గణనీయంగా పడిపోయింది. మూడు న్నర దశాబ్దాలపాటు పశ్చిమబెంగాల్‌ను పాలించిన వామపక్షాలు 2011 ఎన్నికల్లో అధికారానికి దూరమయ్యాయి. తన పాలనాకాలంలో లెఫ్ట్ ఫ్రంట్ బెంగాల్‌లో నిరు పేదలకు భూములు పంచి, కౌలు రైతులకు హక్కులివ్వడంద్వారా బెంగాల్‌లోనే కాదు...దేశంలోనే కీర్తిప్రతిష్టలు ఆర్జించించింది. తీరా అదే ప్రభుత్వం సింగూర్, నందిగ్రామ్‌లలో పరిశ్రమల కోసం అక్కడి రైతుల భూములను బలవంతంగా తీసు కోవడానికి ప్రయత్నించడం దాన్ని అప్రదిష్టపాలు చేసింది. చివరికదే ఆ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణమైంది. అనంతరం మమతా బెనర్జీ నేతృత్వంలో తృణ మూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీపై ఇప్పుడు పెరుగుతున్న అసంతృ ప్తిని సీపీఎం కంటే బీజేపీయే సొమ్ము చేసుకుంటున్నట్టు కనబడుతున్నది. జాతీయ స్థాయిలో చూస్తే సీపీఎంకు పార్లమెంటులో ఉన్న బలం ఎన్నడూ లేనంతగా పడిపో యింది. ఉభయ సభల్లోనూ ఆ పార్టీకి కేవలం 5 శాతం సీట్లు మాత్రమే ఉన్నాయి. లోక్‌సభలో 9మంది, రాజ్యసభలో 9మంది ఉండగా...కేరళనుంచి ఎన్నికైన ఆరుగు రు రాజ్యసభ ఎంపీల్లో ముగ్గురు ఈ నెలాఖరుకు రిటైరవుతున్నారు. మరో ముగ్గురు వచ్చే ఏడాది రిటైరవుతారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రెండుచోట్లా సీపీఎం రాష్ట్ర కమిటీలు సంస్థాగతంగా ఒడిదు డుకులను ఎదుర్కొంటున్నాయి. వీటిని అధిగమించి, ప్రజల విశ్వాసాన్ని చూరగొన డం అక్కడి కమిటీలకు అగ్ని పరీక్ష. అందులో విజయం సాధిస్తేనే జాతీయ స్థాయిలో కనీసం ఇప్పుడున్న బలాన్నయినా సీపీఎం నిలబెట్టు కోగలుగుతుంది.
ఇలాంటి నేపథ్యంలో సీపీఎం సారథ్య బాధ్యతలను ప్రకాష్ కారత్ నుంచి సీతా రాం ఏచూరి స్వీకరించారు. విద్యార్థి ఉద్యమంలో ఎదిగి అనేక పోరాటాల్లో నేరుగా పాలుపంచుకున్న వ్యక్తిగా...ఇటు సైద్ధాంతిక పటిమ ఉన్న నేతగా ఆయనకు పేరుం ది. యాభైయ్యేళ్లనాడు సీపీఎం ఆవిర్భవించినప్పుడు తెలుగువాడు పుచ్చలపల్లి సుందరయ్య దానికి సారథ్యం వహించగా...మళ్లీ ఇన్నేళ్లకు ఈ ప్రాంతంనుంచి ఏచూరి దానికి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అందుకు ఆయనను అభినందించాలి. అయితే ఆయన ముందున్న సవాళ్లు సామాన్యమైనవి కాదు. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో అంతర్గత పోరును చక్కదిద్ది ఆ రెండుచోట్లా పార్టీని గెలుపు బాటలో నడిపించడం ఆయన నిర్వర్తించాల్సిన తక్షణ కర్తవ్యం. దేశంలో అమల్లోకి వచ్చిన నయా ఉదారవాద ఆర్థిక విధానాలు రేకెత్తించిన ఆశలు మధ్యతరగతిని వామ పక్షా లకు దూరం చేసిన మాట వాస్తవమే అయినా...ఆ విధానాలే చెప్పుకోదగినంతగా అసమానతలనూ పెంచాయి. దేశంలో పాలక, ప్రతిపక్షాలు రెండింటికీ ఆ విధానాల విషయంలో వైరుధ్యం లేదు. సకల రంగాలనూ ఆవరించిన అవినీతి ఇప్పుడు ప్రధా న సమస్యగా మారింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వాన ఎన్డీయే సర్కారు ఏర్పడ్డాక మతతత్వ ధోరణులు పెరిగాయి. ఒక మంచి ప్రత్యామ్నాయాన్ని అందించగలమన్న భరోసానిస్తే మద్దతిచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం నిరూపించింది. భవిష్యత్తులో సీపీఐతో విలీనానికి సిద్ధమేనని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాక ఏచూరి ప్రకటించారుగానీ...అంతకన్నా ముందు కనీసం వామపక్షాల ఐక్యత అయినా సాధ్యపడాలని కోరుకుంటున్నవారెందరో ఉన్నారు. ఈ మహాసభల్లో చేసుకున్న ఆత్మవిమర్శ, రూపొందించుకున్న భవిష్యత్తు కార్యక్రమం ఆ దిశగా పార్టీని నడిపిస్తుందని అలాంటివారు ఆశిస్తున్నారు.
లెఫ్ట్ ఐక్యత సాధ్యమేనా?
Published Mon, Apr 20 2015 1:17 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement