ఏపీది కక్షసాధింపు చర్య
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌కు కవిత ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆమె కేంద్ర మంత్రిని కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే పట్టుబడిన అనంతరం ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటుచేసిందని, తెలంగాణకు సంబంధించిన అధికారులపై మాత్రమే కాకుండా సీఎం కేసీఆర్‌పై కేసులు నమోదు చేసిందని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా హోంమంత్రి స్పందిస్తూ సిట్ దర్యాప్తు గురించి తన దృష్టికి రాలేదని, అలా ఎందుకు ఏర్పాటు చేశారంటూ ఆశ్చర్యం వ్యక్తంచేసినట్టు కవిత మీడియాకు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కూడా కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు. కాల్‌డేటాలోని వివరాలు బహిర్గతమైతే దేశ అంతర్గత భద్రతకే ఇబ్బంది కలుగుతుందని మంత్రికి వివరించినట్టు తెలిపారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ నుంచి కూడా కాల్ డేటా, ట్యాపింగ్ వివరాలు వెల్లడించాలన్న విజ్ఞప్తి వస్తోందని, వీటిని బయటకు వెల్లడించడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరగుతుందని వివరించినట్టు తెలిపారు.
రిషితేశ్వరి కేసు సీబీఐకి ఇవ్వాలి..
నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి బలవన్మరణం ఘటనలో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు కవిత పేర్కొన్నారు. ఏపీ సీఎం సమగ్ర విచారణ జరిపిస్తారన్న నమ్మకం లేదని చెప్పినట్టు చెప్పారు. హైకోర్టు విభజనకు చంద్రబాబే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.