* దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గరిష్ట స్థాయికి చేరిన లైన్‌ల వినియోగం
* ఇక కొత్త రైళ్లను నడిపే అవకాశం లేనట్లే
* రద్దీ వేళ అదనపు రైళ్లు నడపలేమని బోర్డుకు తేల్చిచెప్పిన దక్షిణ మధ్య రైల్వే
* లైన్ల వినియోగం 170 శాతాన్ని మించిందంటున్న అధికారులు
* బల్లార్షా-కాజీపేట-విజయవాడ-చెన్నై మూడో లైన్ వేస్తేనే సమస్యకు పరిష్కారం
గరిష్ట వినియోగ స్థాయిని మించి వాడుతున్న మార్గాలు
సికింద్రాబాద్-కాజీపేట
బల్లార్షా-కాజీపేట
కాజీపేట-విజయవాడ
విజయవాడ-విశాఖపట్నం
విజయవాడ-చెన్నై
సాక్షి: ‘దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే లైన్ల గరిష్ట సామర్థ్యాన్ని మించి.. ప్రమాదకర స్థితిలో రైళ్లను నడుపుతున్నాం. లైన్ల వినియోగం ప్రస్తుతం 170 శాతానికిపైగా ఉంది. అన్ని ప్రధాన లైన్ల పరిస్థితీ అదే. ఆయా మార్గాల్లో మూడో లైన్ నిర్మాణం జరిగితేనే సమస్య పరిష్కారమవుతుంది. రద్దీ సమయాల్లో అదనపు రైళ్లను నడపటమంటే పెద్ద రిస్క్ చేస్తున్నట్టే..’.. ఇటీవల రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం చేసుకున్న విన్నపం సారాంశమిది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అవసరమైన స్థాయిలో రైల్వే లైన్లు లేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అన్ని లైన్లను గరిష్ట వినియోగ సామర్థ్యానికి మించి వినియోగిస్తున్నారు. ఇది ప్రమాదకరమని తెలిసినా పెరిగిన రద్దీ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగిస్తున్నారు. దీనికితోడు ప్రత్యేక రైళ్లను నడపాలంటే సాధ్యం కాదని రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. పండుగల సమయంలో బలవంతంగా అదనపు రైళ్లు నడపడం ప్రమాదకరమని తేల్చి చెప్పింది. తాజాగా సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి 120 అదనపు రైళ్లను నడిపినా.. ఏ క్షణాన ఏమవుతుందోనని వణికిపోయింది. స్వయంగా జీఎం మొదలు అధికారులు, సిబ్బంది అంతా శ్రమించి, జాగ్రత్తగా అదనపు రైళ్లను నడిపి ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ఇంత రద్దీ వేళ మరో 200 వరకు అదనపు ైరె ళ్లను నడపాల్సిన అవసరమున్నా... లైన్లపై ఒత్తిడి పెరగడంతో చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ఇది రైల్వేశాఖకే కాకుండా ప్రత్యక్షంగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సవాల్‌గా పరిణమించనుంది. ఏపీ వైపు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరడంతో నల్లగొండ జిల్లా పరిధిలో రోడ్లపై ట్రాఫిక్ భారీగా పెరిగి, ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వేపై ఒత్తిడి చేయకతప్పని పరిస్థితి ఉంది.
కాగితాలకే పరిమితం..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన మార్గాల్లో మూడో లైన్‌ను నిర్మించాల్సి ఉంది. ఒక మార్గాన్ని సరుకు రవాణాకు కేటాయిస్తే... మిగతా రెండు లైన్లను ప్రయాణికుల రైళ్లకు వాడే అవకాశం ఉంటుంది. కానీ ఇది ముందుకు సాగడం లేదు. కాజీపేట మీదుగా బల్లార్షా నుంచి విజయవాడ-చెన్నై వరకు మూడో లైన్ నిర్మాణానికి ఆరేళ్ల క్రితమే పచ్చజెండా ఊపినా... కనీసం భూసేకరణ కూడా జరగలేదు. ఈ పనులకు రూ. 3వేల కోట్లకు పైగా అవసరంకాగా ఇచ్చింది రూ.200 కోట్లే. ఈ మార్గంపై ఒత్తిడి తగ్గించేందుకు గుంటూరు-పగిడిపల్లి-నడికుడి మార్గాన్ని డబ్లింగ్ చేసే అవకాశమున్నా నిధులివ్వడం లేదు. ఇక బీబీనగర్-విజయవాడ ప్రత్యామ్నాయ మార్గానికి పచ్చజెండా ఊపినా.. కనీసం సర్వే చేసేందుకే నిధులు ఇవ్వలేదు. ఇలా డజనుకుపైగా పనులు ఏళ్లుగా కాగితాలకే పరిమితమయ్యాయి.
వేగం పెంచితే కొంత ప్రయోజనం..
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లు గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తున్నాయి. ఈ వేగాన్ని 150 కిలోమీటర్లకు పెంచాలనేది కేంద్రం నిర్ణయం. ఇదే జరిగితే రైల్వే ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది. ఈ మేరకు సికింద్రాబాద్-చెన్నై, హైదరాబాద్-నాగ్‌పూర్ మార్గాల్లో సెమీ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడతామని రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఆ వేగానికి తగినట్లుగా లైన్లను పటిష్టం చేయాల్సి ఉంటుంది. ఇందుకు రూ. 2వేల కోట్ల వరకు అవసరం. కానీ ఇచ్చింది రూ.100 కోట్లే.
హా రైల్వేకు సరుకు రవాణా ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది. దీంతో గూడ్స్ రైళ్లను పెద్దసంఖ్యలో పెంచుతున్నారు. కానీ అందుకు తగ్గట్లు కొత్త లైన్ల నిర్మాణం, పాత వాటి విస్తరణ జరగడం లేదు. దీనివల్ల లైన్లపై ఒత్తిడి పెరిగి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
హా సాధారణంగా ఒక రైలు తదుపరి స్టేషన్ దాటే వరకు మరో రైలుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వరు. కానీ పెరిగిన ట్రాఫిక్ రద్దీ వల్ల స్టేషన్‌కు స్టేషన్‌కు మధ్య అదనంగా ప్రత్యేక సిగ్నల్స్ ఏర్పాటు చేసి... ఆ సిగ్నల్ దాటగానే మరో రైలుకు అనుమతి ఇస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిసినా... తప్పని స్థితిలో అమలు చేస్తున్నారు.
కొత్త రైళ్లకు పట్టాల్లేవ్
Published Mon, Jan 18 2016 2:05 AM | Last Updated on Tue, Aug 28 2018 7:57 PM
Advertisement
Advertisement