పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
సాక్షి,హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రాయితీ రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అక్రమాలకు అలవాటుపడ్డ రేషన్ డీలర్లు, అధికారులు అర్హులకు దక్కాల్సిన బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంగా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల్లో 15 నుంచి 20శాతం వరకు పక్కదారి పడుతుండగా ఇందులో బియ్యం అక్రమాల విలువే రూ.150 కోట్ల వరకు ఉంటోంది.
అందులోనూ ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఏకంగా రూ.15 నుంచి రూ.20 కోట్ల బియాన్ని అక్రమార్కులు భోంచేస్తున్నట్లుగా ప్రభుత్వ నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం అక్రమ వ్యాపారులపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.
బోగస్ డీలర్ల వద్ద కొనుగోలు..
ప్రస్తుతం రాష్ట్రంలో ఆహార భద్రతా పథకం కింద ప్రభుత్వం 2.83 కోట్ల మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. మొత్తంగా ఏటా 18 లక్షల టన్నుల బియ్యాన్ని ఈ పథకం కింద సరఫరా చేస్తుండగా దీనికోసం రూ.2,200 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల నిర్వహణ అధికశాతం బోగస్ డీలర్ల చేతిలోకి వెళ్లడం, నకిలీకార్డులు భారీగా చెలామణిలో ఉండటంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న బియ్యంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.
రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పలువురు డీలర్లు రూ. 6 నుంచి రూ.10కి అక్రమ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. అక్రమ వ్యాపారులు దాన్ని రీసైక్లింగ్ చేసి రూ.15 నుంచి రూ.20కి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇందులో కొందరు రైస్ మిల్లర్ల ప్రమేయం సైతం ఉందని అధికార వర్గాలు గుర్తించాయి.
అక్రమ వ్యాపారం విలువ రూ.150 కోట్లు!
ప్రస్తుతం నిఘా వర్గాలు చెబుతున్న మేరకు ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఏటా 6వేల నుంచి 10వేల టన్నుల బియ్యం పక్కదారి పడుతోం దని, దాని విలువ సుమారు రూ.15 నుంచి రూ.20కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దందా విలువ రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అక్రమాల్లో డీలర్ల పాత్రే ఎక్కువగా ఉండటంతో ఇటీవల జంటనగరాల పరిధిలో విసృ్తత తనిఖీలు మొదలుపెట్టారు.
ఒక్క రంగారెడ్డిలోనే మొత్తంగా 185 కేసులు 6(ఏ) కింద నమోదవగా, మరో 30 క్రిమినల్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో మరింత కఠినం గా వ్యవహరించాలని, పోలీసులతో కలసి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లతో దాడులు నిర్వహించి పీడీ యాక్టు కేసులను మరింత మందిపై ప్రయోగించాలని ప్రభుత్వం భావి స్తోంది. దీంతో పాటే జీపీఎస్, ఈ-పాస్ వ్యవస్థను విసృ్తత పరచాలని యోచిస్తోంది.
పీడీఎస్ పర్యవేక్షణకు విజిలెన్స్ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల పంపిణీ, ఆహార భద్రతాచట్టం అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పా టు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర స్థాయిలోని విజిలెన్స్ కమిటీకి సంబంధిత శాఖ మంత్రి చైర్మన్‌గా, కమిషనర్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, పంచాయతీరాజ్, వ్యవసాయ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు మరో పది విభాగాల నుంచి అధికారులు సభ్యులుగా ఉంటారు.
జిల్లా కమిటీలకు కలెక్టర్, మండలస్థాయిలో ఆర్డీవో, గ్రామస్థాయిలో సర్పంచ్, మున్సిపల్ పరిధి లో జాయింట్ కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరుకుల లభ్యత, కేటాయింపు, పంపిణీ, ఫిర్యాదులు, కొత్త కార్డులజారీ, బోగస్ కార్డుల తొలగింపు అంశాలపై కమిటీలు పర్యవేక్షిస్తాయి.