అనంతపురం : అనంతపురం జెడ్పీ చైర్మన్ కుమారుడినంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ విజయ్ మల్లికార్జున వర్మ తెలిపిన వివరాలివీ.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వల్లభరావుపేట గ్రామానికి చెందిన అత్తోటి సునీల్‌కుమార్ కొన్ని రోజులుగా వసూళ్లు మొదలుపెట్టాడు. విశాఖ జిల్లాకు చెందిన పలువురు రియల్టర్లను జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్ కుమారుడినంటూ బెదిరించి రూ.15 లక్షలు వసూలు చేశాడు.
ఇటీవల అనంతపురంలోని ఓ లాడ్జిలో మకాం వేసిన సునీల్‌కుమార్ ఉద్యోగమిప్పిస్తానని ఆశచూపి ఇద్దరు యువకుల నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడు. అంతేకాకుండా తన వద్ద నున్న బొమ్మ పిస్తోలు చూపి ఓ వ్యాపారి నుంచి రూ.లక్ష వసూలు చేశాడు. అతనిచ్చిన సమాచారం మేరకు వన్‌టౌన్ పోలీసులు సునీల్ కుమార్ ను సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.