మరమగ్గాల కార్మికులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: మరమగ్గాల కార్మికులకు రుణమాఫీ అంశాన్ని వచ్చే సెప్టెంబర్ 30లోగా కొలిక్కి తేవాలని చేనేత, జౌళి శాఖ నిర్ణయించింది. చేనేత, జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రుణమాఫీ మార్గదర్శకాలను అధికారులు బుధవారం ఖరారు చేశారు. రాష్ట్రంలో 49,112 మరమగ్గాలుండగా, సుమారు 38 వేల మరమగ్గాలు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే ఉన్నాయి. మరమగ్గాల కోసం రుణాలు తీసుకున్న కార్మికులు..
చాలీచాలని ఆదాయం, మార్కెటింగ్ అస్థిరత వంటి కారణాలతో నష్టాలు చవిచూశారు. బ్యాంకులు, రాష్ట్ర ఆర్థిక సంస్థకు కార్మికులు చెల్లించాల్సిన బకాయిలు రూ.15.86 కోట్ల మేర పేరుకుపోయాయి. దీంతో తమకు రుణమాఫీ చేయాలని మరమగ్గాల కార్మికులు డిమాండ్ చేశారు.
గతంలోనే మాఫీ ఉత్తర్వులు
మరమగ్గాల కార్మికుల విజ్ఞప్తి మేరకు జనవరిలో రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే మార్గదర్శకాల్లో శాస్త్రీయత లోపించడం, రుణ పరిమితి, వడ్డీ మాఫీ తదితర అంశాలపై స్పష్టత కొరవడింది. దీంతో 2014 మార్చి 31లోపు రూ.లక్షలోపు రుణం ఉన్న వారికి మాఫీ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించారు. బకాయిలపై వడ్డీని మాఫీ చేసేందుకు బ్యాంకులూ అంగీకరించాయి.
గతంలో 5హెచ్‌పీ విద్యుత్ సామర్థ్యమున్న మరమగ్గాలకే మాఫీ వర్తిస్తుందని పేర్కొనగా, ప్రస్తుతం అంతకంటే ఎక్కువ సామర్థ్యమున్న వాటికీ వర్తింపచేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5.63 కోట్లు విడుదల చేసింది.