
తిరుమల దర్శనానికి వెళ్లివస్తూ....
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించారు. బాలాయపల్లి మండలం చుట్టి పాతబస్టాప్ దగ్గర అతి వేగంగా వస్తున్న వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
నెల్లూరు పసుపులేటి వారి వీధికి చెందిన అశోక్ కుటుంబం తిరుమల శ్రీవారి దర్శించుకొని తిరిగి ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అశోక్(30), ఆయన భార్య నాగలక్ష్మి(26), ఆయన తల్లి సుజాత(60) మరణించారు.
కారులోనే ఉన్న ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయట పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, నాయనమ్మ మరణించడంతో ఇద్దరు పిల్లల బాధ వర్ణనాతీతంగా మారింది.