నేడు ప్లస్‌టూ ఫలితాలు
సాక్షి, చెన్నై: మరికొన్ని గంటల్లో ప్లస్‌టూ ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాల్ని విద్యార్థులు తెలుసుకునేందుకు వీలుగా విద్యా శాఖ సర్వం సిద్ధం చేసింది. ప్రత్యేక వెబ్‌సైట్లను ప్రకటించింది. ప్లస్‌టూ పరీక్షలు మార్చి నాలుగో తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగాయి. రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలోని 6,550 పాఠశాలలకు చెందిన 8,39,697 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే, ఈ సారి పరీక్ష కాలంలో ఎన్నికలు రావడంతో విద్యార్థులకు తంటాలు తప్పలేదు. ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే మరో వైపు మార్చి పన్నెండో తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మూల్యాంకణ ప్రక్రియను విద్యా శాఖ వర్గాలు చేపట్టారు.
విద్యార్థులు మార్కుల వివరాల్ని కోట్టూరు పురంలోని ప్రభుత్వ డేటా సెంటర్‌లో పొందు పరిచే పనిలో పడ్డారు. ఎన్నికల ముందే ఫలితాల్ని వెల్లడించేందుకు యత్నించినా, ఉన్నత చదువుల నిమిత్తం సీట్ల ఎంపిక, కౌన్సెలింగ్ తదితర అంశాల వ్యవహారాల్లో విద్యార్థులకు ఇరకాటాలు తప్పదన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఎన్నికల తదుపరి రోజున ఫలితాల వెల్లడికి చర్యలు చేపట్టారు. ఇందుకు తగ్గ ప్రకటనను గత వారం విడుదల చేశారు. ఆ మేరకు మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి.
ఇందు కోసం విద్యా శాఖ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. నుంగంబాక్కంలోని డీపీఐ ఆవరణలో పరీక్షల విభాగం డెరైక్టర్ వసుంధర దేవి ఈ ఫలితాల్ని విడుదల చేయనున్నారు. ఆయా స్కూళ్ల వద్ద విద్యార్థులు ఫలితాల్ని తెలుసుకునేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ఇక, ఆన్‌లైన్ ద్వారా ఫలితాల్ని తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్ సైట్‌లను ప్రకటించారు. ఆ మేరకు విద్యార్థులు www.tnresults.nic.in,www.dge1.tn.nic.in, www.dge2.tn.nic.in, www.dge.tn.nic.in ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాల వెల్లడి అనంతరం మార్కుల జాబితా పంపిణీ, రీ వాల్యుయేషన్, రీ టోటలింగ్ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.