ఏపీ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కేది ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చడం, నవంబరు 15 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కడ్నుంచి నడపాలనే అంశం తెరపైకి వచ్చింది. విజయవాడ నుంచి నడపాలా? విశాఖ నుంచి నడిపించాలా? అన్న అంశంలో తకరారు నడుస్తోంది. ఈ పంచాయితీ తాజాగా రైల్వే బోర్డుకు చేరింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గతేడాది రైల్వే బడ్జెట్‌లోనే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచే నడుపుతామని రైల్వేశాఖ ప్రకటించింది.
అప్పట్లోనే రెండు మూడు నెలల్లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచే నడుపుతామని ప్రకటించారు. ఈ మేరకు రైల్వే రేక్‌లను కేటాయించారు. విజయవాడ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు అంతా సిద్ధం చేసిన తర్వాత విశాఖపట్టణం నుంచే రైలును నేరుగా ఢిల్లీ నడపాలని అక్కడి ప్రజా ప్రతినిధులు పట్టుబడుతున్నారు.
ఏపీ ఎక్స్‌ప్రెస్ కూడా రాదా?
విశాఖకు రైల్వేజోన్ సాధించుకొస్తామని ప్రతిజ్ఞ చేసిన టీడీపీ, బీజేపీ నేతలు అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు కనీసం దేశ రాజధానికి వేళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖనుంచే నడపాలనే డిమాండ్ తేవడంతో రైలును ఎక్కడ్నుంచి నడపాలనే అంశంలో పీటముడి పడింది. అటు రాయలసీమ నుంచి, ఇటు ఉత్తరాంధ్ర నుంచి కొన్ని బోగీలు కలిపి విజయవాడ నుంచి నడిపేందుకు ఇక్కడి రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఉత్తరాంధ్ర వాసులు పట్టుబట్టడంతో పంచాయితీ రైల్వే బోర్డుకి చేరింది. తిరుపతి నుంచి, విశాఖపట్టణం నుంచి బోగీలను విజయవాడలో కలిపి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని విజయవాడ ప్రాంత ప్రతినిధులు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.