పంచాయితీల సినిమా | cinema people hulchul in visakhapatnam | Sakshi
Sakshi News home page

పంచాయితీల సినిమా

Published Sun, Sep 4 2016 9:28 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

cinema people hulchul in visakhapatnam

పరిశ్రమ రాకుండానే విశాఖలో పెరుగుతున్న సినీ వివాదాలు
వైఎస్ హయాంలోనే సినీ పరిశ్రమ అభివృద్ధికి భూముల కేటాయింపు
ఆయన హఠాన్మరణం తర్వాత వాటి అతీగతీ లేదు
నవ్యాంధ్రలోనూ పాలకుల అంతులేని నిర్లక్ష్యం
సినీ కో ఆర్డినేటర్ల ముసుగులో కొందరి ఆగడాలు
నయీం అండతో థియేటర్లు , క్యాంటీన్లపై పెత్తనం
భూ దందాల్లోనూ కొందరు సినీ పెద్దలు

 
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో విశాఖ ఆర్థిక రాజధానిగా.. సినీ పరిశ్రమ కేంద్రంగా వర్ధిల్లుతుందని అందరూ ఆశించారు.కానీ ఆర్ధిక రాజధాని మాటేమో గానీ.. రెండున్నరేళ్లవుతున్నా సినీ పరిశ్రమ జాడే లేకపోగా.. కొందరు వివాదాల సినిమా చూపిస్తున్నారు. ఎప్పుడో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖలో సినీపరిశ్రమ అభివృద్ధికి కేటాయించిన భూముల అతీగతీ కూడా లేదు. అడపాదడపా జరిగే షూటింగులు, సినిమా ఫంక్షన్లు తప్ప సినీ పరిశ్రమ కొలువుదీరేందుకు కనీస ప్రయత్నాలైనా పాలకులు చేపట్టలేదు.
 
 పరిశ్రమ రాకున్నా పంచాయితీలకు మాత్రం లోటు లేదు. ఎప్పటికైనా సినీరంగం ఇక్కడికి తరలివస్తుందన్న అంచనాతో కొందరు ముదుర్లు.. జూనియర్ ఆర్టిస్టుల సప్లై పేరిట వివాదాలకు తెర తీస్తున్నారు. ఇక్కడ జరిగే షూటింగుల్లో స్థానికులకే అవకాశాలు ఇవ్వాలంటూ గొడవలకు ఆస్కారమిస్తున్నారు.
 
 ఇక గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ నేరాల చిట్టా విప్పుతుంటే.. విశాఖలో సినీపెద్దల పంచాయితీలు బయటపడుతున్నాయట!.. భూముల కొనుగోలు మొదలు.. సినిమా థియేటర్ల లీజులు, క్యాంటీన్ కాంట్రాక్టుల వరకు నయీమ్ నీడలోనే జరిగినట్లు విశాఖకే చెందిన ఓ సినీ నిర్మాత బహిరంగ ఆరోపణలే చేశారు. వీటి నేపథ్యంలో అసలు విశాఖలో ఆడుతున్న పంచాయితీల సినిమాను ఈ వారం విశాఖ తీరంలో చూద్దాం..
 
విశాఖపట్నం : సాగర తీరాల్లో ప్రపంచంలోని ఎన్నో నగరాలు కొలువుదీరినా వాటిలో విశాఖ నగరిది ప్రత్యేక స్థానం. ఇక్కడి సాగరతీరం.. పచ్చని కొండలు.. పర్యాటక ప్రాంతాలు పర్యాటక రంగానికే కాకుండా.. సినీ షూటింగులకూ స్వర్గధామాలు. అందువల్లే విభజన తర్వాత సినీ పరిశ్రమకు విశాఖకు తరలివస్తుందని అందరూ అనుకున్నారు. అది ఇప్పటికిప్పుడే సాధ్యం కాకపోయినా.. షూటింగులు, ఇతర సినీ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతాయని ఆశించారు. కానీ గత రెండున్నరేళ్లలో ఆ ఆశలు ఏమాత్రం చిగురించలేదు సరి కదా.. వ డలిపోతున్నాయి. వాటన్నింటికీ మించి సినీ పంచాయితీలు ఎక్కువై సినీ పరిశ్రమ రాకపై అనుమానాలు పెంచుతున్నాయి.
 
 కో ఆర్డినేటర్ల హల్‌చల్
 పరిశ్రమ విశాఖలో కాలుమోపక ముందే ఇక్కడ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న కొందరు ప్రబుద్ధులు జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే కో ఆర్డినేటర్ల ముసుగులో చిల్లర చేష్టలకు దిగుతున్నారు. ఏరియాకొకరు చొప్పున సినీ కో ఆర్డినేటర్ల అవతారమెత్తి సినిమాలు తీసేందుకు ఇక్కడికి వచ్చిన వారిని ఇబ్బందులు పాల్జేస్తున్నారు. ఇటీవల మంచు మనోజ్ హీరోగా ‘ఒక్కడినే మిగిలాను’ సినిమా చిత్రీకరణ లో చోటు చేసుకున్న వివాదమే దీనికి ఉదాహరణ. నగర సమీపంలోని ముత్యాలమ్మపాలెంలో కొన్ని సీన్లు తీసిన చిత్రృబందం.. ఇక్కడి వాతావరణం నచ్చడంతో అప్పటికప్పుడు ప్లాన్ మార్చుకొని భారీ సెట్టింగులతో ఓ పోరాట సన్నివేశం తీయాలని భావించారు. దానికి వందలాది జూనియర్ ఆర్టిస్టులు అవసరం. దీంతో స్థానికంగా ఉన్న ఏజెంట్ల(కో ఆర్డినేటర్లు)ను సంప్రదించారు.
 
 వారు విశాఖలోని అన్ని ఫెడరేషన్ల నుంచి జూనియర్ ఆర్టిస్టులను సమీకరించి అప్పగించారు. అయితే చెల్లింపు వద్ద తలెత్తిన వివాదం కాస్త.. రోడ్డెక్కింది. ముందుగా ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని ఫెడరేషన్ల నేతలు.. తక్కువ మందిని తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని దర్శక, నిర్మాతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. చివరికి హీరో మంచు మనోజ్ కూడా మీడియా ముందుకొచ్చి విశాఖలో షూటింగులు సజావుగా జరగకుండా నకిలీ ఫెడరేషన్లు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఇలా అయితే సినీ పరిశ్రమ ఇక్కడికి రావడంపై పునరాలోచించాలని వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఏ స్థాయి గాడి తప్పిందో అర్ధం చేసుకోవచ్చు.
 
 భూదందాల్లో సినీ పెద్దలు
 గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్‌తో జతకట్టి  వివాదాస్పద భూముల కొనుగోలు మొదలు.. థియేటర్ల లీజు, క్యాంటీన్ వ్యవహారాల వరకు కొందరు సినీ ప్రముఖులు దందాలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సినీ నిర్మాతతో పాటు యువహీరో సోదరుడు, జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి అల్లుడు, మరో పదిమంది.. వెరసి 13మంది సిండికేట్‌గా ఏర్పడి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని థియేటర్లను గుత్తాధిపత్యంలోకి తీసుకున్నారన్న వాదనలు ఉన్నాయి.
 
 ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న థియేటర్ల యజమానులకు సాధారణ వడ్డీల పేరిట అప్పులిచ్చి... ఆనక బారు, చక్రవడ్డీలతో పీల్చిపిప్పి చేసేవారు. అప్పులు చెల్లించలేని పరిస్థితి కల్పించి.. థియేటర్లలో భాగస్వామ్యం తీసుకోవడం, గుత్తాధిపత్యంతో యజమానులను ముప్పుతిప్పలు పెట్టేవారన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినా చెందకపోయినా.. ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖలో పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అయితే నయీముద్దీన్‌తో జత కట్టినృబందంలోని సభ్యులు మాత్రం వివాదాస్పద భూములను సొంతం చేసుకున్నారని అంటున్నారు. ఓ సినీనిర్మాత డిమాండ్ చేసినట్టు నయీమ్ ఉదంతాలపై సీబీఐ దర్యాప్తు జరిగితేనే చీకటి దందాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
 
 అలా చేస్తేనే అభివృద్ధి
 వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో భీమిలి బీచ్‌రోడ్డు నిడిగట్టు పంచాయతీలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు 316 ఎకరాలు కేటాయించారు. స్టూడియోలు, డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లతో పాటు సినీ నిర్మాణంలో భాగమైన అన్ని క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉండేలా దాన్ని వినియోగించాలని ప్రతిపాదించారు. కానీ వైఎస్ హఠాన్మరణంతో ఆ భూముల అభివృద్ధి అతీగతీ లేకుండా పోయింది. ఆ తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. స్టూడియోల నిర్మాణం జరిగి చిత్ర పరిశ్రమ వేళ్లూనుకుంటే తెలుగుతో పాటు ఒడియా, బెంగాలీ సినిమాలకు కూడా విశాఖ కేంద్రంగా మారుతుంది.
 
 బెంబేలెత్తిన బెంగాలీ యూనిట్
 తెలుగు సినీపరిశ్రమలో దిగ్గజం లాంటి మంచు కుటుంబం హీరో సినిమాకే ముప్పుతిప్పలు పెట్టిన ఇక్కడి దందాల సంస్కృతి పరాయి భాషల సినిమావాళ్లకైతే చుక్కలు చూపిస్తోంది. విశాఖలో షూటింగులకు వచ్చే రాష్ట్రేతర చిత్ర యూనిట్లపై రాబందుల్లా పడి వేధిస్తున్నారన్న ఆరోపణలు మూటకట్టుకుంటున్నారు. ఇక్కడ జరిగే షూటింగుల్లో స్థానికులకే ప్రాధాన్యమివ్వాలనే సాకుతో వేధింపులకు, బెదిరింపులకు దిగుతున్నారు. వాటిని ఖాతరు చేయకుండా షూటింగ్‌కు వెళ్తే లేనిపోని వివాదాలు ృసష్టిస్తున్నారు.
 
 ఈ లోకల్ దందా తట్టుకోలేని ఓ బెంగాలీ చిత్ర యూనిట్ షూటింగ్ రద్దు చేసుకుని వెళ్లిపోయింది. పరిశ్రమ నగరానికి రాకముందే షూటింగుల్లో ఫైటింగ్‌లు జరుగుతుంటే.. తరలివస్తే పరిస్థితేమిటన్న ఆందోళన కొందరిలో నెలకొంది. ఆర్టిస్టులు కాని వారిని సైతం రోజువారీ కూలీకి తీసుకువచ్చి జూనియర్ ఆర్టిస్టులుగా చూపిస్తున్నారు. గత్యంతరం లేక వారినే తీసుకొని షూటింగులు జరపుకోవాల్సి వస్తోంది.  ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్‌లో పేర్లు నమోదు చేయించుకున్న జూనియర్ ఆర్టిస్టులకే అవకాశం కల్పిస్తే గొడవలకు ఆస్కారం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement