ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎటు? | AP Express where | Sakshi
Sakshi News home page

ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎటు?

Published Mon, Jul 27 2015 1:20 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎటు? - Sakshi

ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎటు?

- ప్రయాణ మార్గంపై ఇంకా రాని స్పష్టత
- రెండు జోన్ల మధ్య సమన్యయ లోపం
- ఫలితంగా ఆలస్యమవుతున్న వైనం
- అంతా ఓకే అయితే సెప్టెంబర్‌లో కూత
విశాఖపట్నం సిటీః
ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖ నుంచి నడిపేందుకు రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. దక్షిణ మధ్య రైల్వేకి ఈమేరకు బోర్డు నివేదించినట్లు తెలిసింది. అయితే విశాఖ నుంచి ఏ మార్గంలో నడపాలో స్పష్టత కొరవడింది. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు 18 నుంచి 20 గంటలు పడుతుంది. రాయగడ మీదుగా అయితే రెండు మూడు గంటల సమయం తగ్గుతుంది. విజయవాడ మీదుగా ప్రయాణిస్తే 20 గంటల సమయం తీసుకుంటుంది. విశాఖ నుంచి ఇప్పటికే నాలుగు రైళ్లు రాజధానికి నడుస్తున్నాయి. సమతా, హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌లు రాయగడ మీదుగా నడుస్తున్నాయి. దక్షిణ్ లింక్, స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లు విజయవాడ మీదుగా నడుస్తున్నాయి.

ఏపీ ఎక్స్‌ప్రెస్ కూడా తోడయితే అయిదు రైళ్లు అవుతాయి. ఇప్పుడు ఈ రైలు ఏ మార్గం గుండా బయల్దేరుతుందనేది సమస్యగా తయారైంది. 2014లో బడ్జెట్‌లో ప్రకటించిన ఈ రైలు ఎటు నడపాలో తెలియక ఆలస్యమవుతోందని రైల్వే వర్గాలంటున్నాయి. మార్గంపై స్పష్టత రాకపోవడం వెనుక దక్షిణ మధ్య, తూర్పు కోస్తా రైల్వేల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. విజయవాడ మీదుగా నడిపితే తూర్పు కోస్తా రైల్వేకు భారమవుతుంది. అందుకే రాయగడ మీదుగా నడిపేందుకు ప్రయత్నిస్తోంది. విజయవాడ మీదుగా నడిపితే నిర్వహణ విశాఖకే వస్తుంది. ఆదాయం మాత్రం దువ్వాడ వరకే అంటే 20 కిలోమీటర్లే ఉండడంతో ఆశించినంత ఆదాయం రాదని భావిస్తున్నట్టు తెలిసింది.

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా రైలును తూర్పు కోస్తాకే ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.ఎంపీ హరిబాబు ఈ రైలును విజయవాడ మీదుగా నడిపేందుకే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ భాగం కవరవుతుందనేది ఆయన వాదన.ఏమైనప్పటికీ రెండు జోన్ల మధ్య సమన్వయం కుదిరితే సెప్టెంబర్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కవచ్చంటున్నారు. ఆగస్టు ఆఖరి వారంలోనైనా ప్రారంభమయ్యే అవకాశముంది. రైల్వే టైం టేబుల్ పట్టికలో ఇంతవరకూ ఈ రైలుకు స్థానం కల్పించలేదు. వచ్చే సెప్టెంబర్‌లో విడుదలయ్యేపట్టికలో ఈ రైలు రాకపోకల వేళలు ప్రకటించే అవకాశాలున్నాయి. అప్పటికి గానీ ఈ రైలు ఏ మార్గంలో ఎన్ని గంటలకు ఎక్కడి నుంచి ఎక్కడికి బయల్దేరుతుందో తెలియదంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement