Vande Bharat Express For Visakhapatnam To Vijayawada - Sakshi
Sakshi News home page

విశాఖ టూ విజయవాడ ఇక నాలుగు గంటలే 

Published Fri, Nov 25 2022 3:45 AM | Last Updated on Fri, Nov 25 2022 10:03 AM

Vande Bharat Express For Visakhapatnam To Vijayawada - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వాల్తేరుని ఊరిస్తున్న వందేభారత్‌ రైలును అతి త్వరలోనే పట్టాలెక్కించేందుకు ముహూర్తం సిద్ధమవుతోంది. బుల్లెట్‌లా దూసుకెళ్తూ.. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేలా ప్రవేశపెట్టిన అత్యాధునిక సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్‌ను విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు డిసెంబర్‌లో ప్రారంభించేందుకు అ«ధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

విశాఖ నుంచి విజయవాడకు దాదాపు 2 గంటల ప్రయాణాన్ని తగ్గించేలా ట్రాక్‌ పరిశీలనల్లో వాల్తేరు డివిజన్‌ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే డివిజన్‌కు వందేభారత్‌ రేక్‌ కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది. త్వరలో విశాఖకు రానున్న ఈ ట్రైన్‌ ట్రయల్‌ రన్‌  వచ్చే నెలలో నిర్వహించనున్నారు. 

160 కి.మీ. వేగంతో.. 
ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గంటకు 80 కి.మీ. గరిష్ట వేగంతో నడుస్తుండగా.. వందేభారత్‌ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగంతో దూసుకెళ్లనున్నాయి. ఈ లెక్కన విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రస్తుతం రైలు ప్రయాణానికి 6 గంటల సమయం పడుతుండగా.. వందేభారత్‌ రైలు రాకతో కేవలం 4 గంటల్లోనే విజయవాడ చేరుకోవచ్చు.

ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల కంటే రెట్టింపు వేగంతో వందేభారత్‌ దూసుకుపోతుంది కాబట్టి ట్రాక్‌ పటిష్టత ఎలా ఉంది, దాని సామర్థ్యం సరిపోతుందా లేదా తదితర అంశాలను వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) అనూప్‌కుమార్‌ సత్పతి, ఇతర డివిజనల్‌ అధికారులు, ట్రాక్‌ నిపుణులతో కలసి గురువారం పరిశీలించారు. ఇందుకోసం విశాఖపట్నం–తిరుపతి మధ్య నడిచే డబుల్‌ డెక్కర్‌ రైలుని వినియోగించారు. వందేభారత్‌ రైల్‌ కోచ్‌ల నిర్వహణ సామర్థ్యాలు, సౌకర్యాలు ఇక్కడి ట్రాక్‌పై ఉన్నాయా లేవా అనేది పరిశీలన జరిపారు.
 
‘వందేభారత్‌’లో అత్యాధునిక సౌకర్యాలు 

వీటిలో ఎమర్జెన్సీ లైటింగ్‌ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 లైట్లు ఉంటాయి. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడినా ఇబ్బంది లేకుండా ఈ లైట్లు ఉపయోగపడతాయి. కోచ్‌లకు బయటవైపు నుంచి 4 కెమెరాలు ఉంటాయి. వెనుక వైపు నుంచి మరొకటి ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 అత్యవసర ద్వారాలు ఉంటాయి. అన్ని కోచ్‌లు పూర్తిగా ఏసీ సదుపాయంతో ఉంటాయి.

ప్రతి కోచ్‌లో 32 ఇంచిల స్క్రీన్‌తో ప్రయాణికుల సమాచార వ్యవస్థ ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటుచేసిన అగ్నిమాపక పరికరాలు కొద్దిపాటి పొగను కూడా వెంటనే పసిగట్టి ప్రయాణికు­లను అప్రమత్తం చేస్తాయి. ఇందులో చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న వందేభారత్‌ రైళ్లలో నిర్దేశించిన ధరల ప్రకారం చూస్తే విజయవాడకు చైర్‌కార్‌లో దాదాపు రూ.850, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో రూ.1,600 నుంచి రూ.1,650 వరకూ ఉండే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  

భవిష్యత్‌లో పరిధి పెంచుతాం 
ఇప్పటికే విశాఖపట్నం డివిజన్‌కు 8 కోచ్‌లతో కూడిన రెండు యూనిట్స్‌ వందేభారత్‌ రైలుని కేటాయించినట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. దానికనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ రైలు డిసెంబర్‌ రెండో వారంలో వచ్చే అవకాశం ఉంది.

వచ్చిన వెంటనే ట్రయల్‌ చేపట్టి సర్వీసును ప్రారంభిస్తాం. భవిష్యత్‌లో మరో రేక్‌ కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ రేక్‌ వస్తే తిరుపతి లేదా హైదరాబాద్‌ వరకూ డిమాండ్‌ను బట్టి నడపాలని భావిస్తున్నాం. 
– అనూప్‌కుమార్‌ సత్పతి, డీఆర్‌ఎం, వాల్తేరు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement