కొవ్వు పదార్థాలు ఎక్కువ తినొద్దన్న సలహా మీకు ఎప్పుడైనా వచ్చిందా? కొంచెం బొద్దుగా ఉన్నా.. కాస్త లావెక్కినా అందరి నోటి నుంచి వచ్చే మాటే ఇది. చాలామంది ఈ సూచనను నమ్మి ఆచరిస్తుంటారు కూడా. 50 ఏళ్ల కింద జరిగిన ఒక కుట్ర ఫలితంగా కొవ్వు పదార్థాలు మనకు చెడు చేసేవిగా చిత్రీకరించాయని.. అసలు విలన్ మనం తినే చక్కెర అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఫలానా పదార్థం మనకు మంచి చేస్తుంది... ఫలా నాది హాని చేస్తుందని ఎవరు నిర్ధరిస్తారు? పదార్థాలను క్షుణ్నంగా పరిశీలించాక శాస్త్రవేత్తలు వాటి లక్షణాలను వెల్లడిస్తారు. ఇందుకు సంబంధించి పరిశోధన వ్యాసాలు ప్రచురిస్తారు.
1960 ప్రాంతంలో ‘ప్రాజెక్ట్ 259’పేరుతో ఎలుకలపై రెండు పరిశోధనలు జరిగాయి. చక్కెర పరి శ్రమల సమాఖ్య ఒకటి ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అం దించింది. ఒక పరిశోధనలో భాగంగా రెండు గుంపుల ఎలుకలను తీసుకున్నారు. ఒక గుంపులోని వాటికి చక్కెరలు బాగా ఎక్కువ ఉండే ఆహారాన్ని అందించగా.. ఇంకో దానికి చేపలు, పప్పుధాన్యాలు, ఈస్ట్, బీన్స్ వంటి వాటితో కూడిన సమతుల ఆహారం అందించారు. కొంత కాలం తర్వాత పరిశీలిస్తే మొదటి గ్రూపులోని ఎలుకలకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది.
వీటిల్లో చెడు కొవ్వులుగా పరిగణించే ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రెండో అధ్య యనంలో భాగంగా కొన్ని ఎలుకలకు చక్కెరలు ఎక్కువగా ఉండే తిండి.. రెండో గ్రూపు ఎలుకలకు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారమందించి చూడగా.. మొదటి గ్రూపు ఎలుకల్లో కేన్సర్ కారక ఎంజైమ్‌లు ఎక్కువైనట్లు తెలిసింది. చక్కెరతో సమస్యలున్నాయని స్పష్టంగా తెలిపిన ఈ అధ్యయనాలు ఇప్పటివరకూ ప్రచురణకు నోచుకోలేదు. చక్కెర పరిశ్రమల సమాఖ్య ‘ప్రాజెక్టు 259’ను అర్ధంతరంగా నిలిపేసింది.
తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?
గత 50 ఏళ్లలో చక్కెరల దుష్ప్రభావంపై చాలా పరిశోధనలే జరిగాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో పాటు మూత్ర పిండాల సమస్యలకూ ఈ పదార్థమే కారణమని పలు పరి శోధనలు స్పష్టం చేశాయి. తాజాగా జరిగిన కొన్ని పరిశోధ నలు చక్కెరలు కేన్సర్ కణితుల పెరుగుదల పనిచేస్తున్నట్లు సూచించాయి. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సిన అవసరముంది.
ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలం వరకూ కొన్ని రకాల ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదని చెబుతూ వచ్చిన వైద్యులు కూడా ఇప్పుడు తమ విధానాలను మార్చుకుంటున్నారు. రోజుకు కొంత నెయ్యి, లేదంటే గుడ్డులోని పచ్చసొన తీసుకోవడంలో తప్పు లేదని అంటున్నారు. శీతల పానీయాల్లో చక్కెరలను తగ్గించేం దుకు పరిశ్రమలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. 2021 నాటికి అమెరికాలో తయారయ్యే ప్రతి ఆహార పదార్థం ప్యాకేజింగ్‌పై చక్కెర మోతాదు ఎంత అన్నది స్పష్టంగా ప్రదర్శించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
ఎందుకీ కుట్ర..
అధిక చక్కెరల వల్ల రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశ ముందని గతేడాది ఓ అధ్యయనం ప్రచురితమైనప్పుడు అమెరికాకు చెందిన ‘షుగర్ అసోసియేషన్’తీవ్రంగా స్పందించింది. ఈ పరిశోధన సంచలనాల కోసం రాసిందే గానీ.. మనం తీసుకునే చక్కెరలకు, కేన్సర్‌కు ఏ మాత్రం సంబంధం లేదని ఖండించింది. ఈ ‘షుగర్ అసోసియేషన్’ను గతంలో ‘ది షుగర్ రీసెర్చ్ ఫౌండేషన్’ అని పిలిచే వారని.. కొంతమంది శాస్త్రవేత్తలు ప్లాస్ బయాలజీ అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.
తమకు అనుకూలంగా లేని పరిశోధనల గొంతు నొక్కేయడం దీనికి కొత్తేమీ కాదని.. 50 ఏళ్ల కింద కూడా ఇలాగే చేశారంటూ 1960 నాటి అంశాన్ని వివరించడంతో విషయం వెలుగు చూసింది. 1967 ప్రాంతంలో ‘షుగర్ అసోసియేషన్’ చక్కెరల వల్ల ప్రమాదం లేదని.. సమస్య అంతా కొవ్వుల వల్లేనని ప్రచారం చేసేందుకు ముగ్గురు హార్వర్డ్ శాస్త్రవేత్తలకు లంచాలిచ్చినట్లు ఇప్పటికే స్పష్టమవడం కొసమెరుపు!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment