పెన్నా, పయనీర్ రిసార్ట్స్‌ల విషయంలో ఈడీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో జప్తు చేసిన పెన్నా సిమెంట్స్, పయనీర్ హాలిడే రిసార్ట్స్ లిమిటెడ్‌లకు చెందిన ఆస్తులను పది రోజుల పాటు స్వాధీనం చేసుకోవద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) ను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పది రోజుల తరువాత ఆస్తుల స్వాధీనానికి చర్యలు తీసుకోవచ్చునని ఈడీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు రెండు రోజుల కిందట మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలంటూ ఈడీ జాయింట్ డెరైక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెన్నా సిమెంట్స్ లిమిటెడ్, పయనీర్ హాలీడే రిసార్ట్స్ లిమిటెడ్‌లు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలను న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు విచారించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీతారామ్మూర్తి వాదనలు వినిపించారు. పిటిషనర్లకు చెందిన అనంతపురం జిల్లా యాడికి మండలంలో ఉన్న 231 ఎకరాలు, పయనీర్ రిసార్ట్స్‌కు చెందిన భవనంలోని పలు అంతస్తులను ఈడీ గతేడాది జప్తు చేసుకుందని తెలిపారు. ఆస్తుల స్వాధీనానికి ఈడీ జాయింట్ డెరైక్టర్ గత నెల 29న ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను తమకు ఏప్రిల్ 2న అందచేశారన్నారు. ఇప్పుడు వాటి ని స్వాధీనం చేసుకుంటే పెన్నా సిమెంట్ కర్మాగారానికి దారి ఉండదని సీతారామ్మూర్తి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆస్తుల స్వాధీనం చెల్లదని, కనీసం పది రోజుల గడువు ఇవ్వాలని ఆయన తెలిపారు. తరువాత ఈడీ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్ స్పందిస్తూ.. జప్తు చేసిన ఆస్తులను పదిరోజుల పాటు స్వాధీనం చేసుకోబోమని హామీ ఇచ్చారు. ఈ హామీని నమోదు చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.
10 రోజులు ఆస్తులు స్వాధీనం చేసుకోవద్దు
Published Sat, Apr 9 2016 3:50 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement