జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఇందూ గ్రూపు సంస్థల చైర్మన్ ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ
సీబీఐకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఇందూ గ్రూపు సంస్థల చైర్మన్ ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని హైకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కంపెనీల తరఫున బోర్డు డెరైక్టర్ల ప్రతినిధిగా శ్యాంప్రసాద్‌రెడ్డి పెట్టుబడులు పెట్టారే తప్ప వ్యక్తిగతంగా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.విజయసేన్‌రెడ్డి అన్నారు. వ్యక్తిగతంగా ప్రయోజనం కూడా పొందలేదని వివరించారు.
పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనం పొందినట్టు సీబీఐ కూడా తన చార్జిషీట్‌లో ఎక్కడా పేర్కొనలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ‘‘ఇందూటెక్ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి రత్నప్రభపై సీబీఐ కేసును హైకోర్టు కొట్టేసింది. దీన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇండియా సిమెంట్స్ కేసులో శ్రీనివాసన్‌పై కేసును కూడా హైకోర్టు కొట్టేసింది. ఈ కేసుల్లో పలువురు నిందితులు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు’’ అని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.