నోటితో పాటు ముక్కుకు ప్లాస్టర్ వేయడంతోనే..
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో నిందితులను సీపీ మహేందర్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. తెలిసిన వ్యక్తులే స్నేహపూర్వకంగా నమ్మించి హత్యకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. నిందితులకు కఠినశిక్ష పడేలా ఆధారాలు సేకరించామని అన్నారు.
కిడ్నాప్ వ్యవహారం జరిగిందిలా.. శేషు కుమార్ అలియాస్ సాయి అనే యువకుడు రవి, మోహన్ అనే ఇద్దరు మిత్రులతో కలిసి ముందుగా ప్లాన్ చేసి ఈ నెల 16న అభయ్ను కిడ్నాప్ చేశారని సీపీ వెల్లడించారు. టిఫిన్ తీసుకురావడానికి వచ్చిన అభయ్ను లిఫ్ట్ ఇవ్వమని అడిగి.. సాయి తన రూంకు తీసుకెళ్లాడని, తరువాత స్నేహపూర్వకంగా మాట్లాడి కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పి నోటితో పాటు ముక్కుకు ప్లాస్టర్ వేయడంతో అభయ్ మృతి చెందాడని ఆయన వెల్లడించారు. అభయ్ మృతి చెందిన తరువాత నిందితులు రైళ్లో వెళ్తూ.. అతని తల్లిదండ్రులను డబ్బుకోసం డిమాండ్ చేశారని తెలిపారు. ముగ్గురు నిందితులను ఇచ్చాపురం, బర్హాంపురంలలో అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
పక్కా ప్లాన్ ప్రకారం ప్లాస్టర్లు, కొత్త ఫోన్లు, సిమ్ కార్డులు కొనుగోలు చేసి నిందితులు పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడ్డారని కమిషనర్ వెల్లడించారు. డబ్బు సంపాదించి సినిమాల్లో నటించాలనే కోరికతో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. దీనికి కొన్ని సినిమాలు, ఫేస్బుక్ పరిచయాలు ప్రేరేపించాయని కమిషనర్ వెల్లడిచారు.