ఆటోలోనే అభయ్ కిడ్నాప్!
కేసులో మొత్తం నలుగురి ప్రమేయం
♦ ఏపీలో అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
♦ ఆటో డ్రైవర్ పాత్రపైనా దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసు కొలిక్కి వస్తోంది. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు సభ్యులు ముఠా కట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళంలో గాలింపు చేపట్టిన టాస్క్‌ఫోర్స్ బృందాలు ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌లో వీరితోపాటు ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు అభయ్‌ను ఆటోలో కిడ్నాప్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. అభయ్‌ని దారుస్సలాం నుంచి ఆటోలో తీసుకువెళ్లినట్లు తేలడంతో ఆ ఆటోను గుర్తించే పనిలో పడ్డారు. ఆటోడ్రైవర్ పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది. హత్య ఆటోలో ఉండగా జరిగిందా? దిగిన తర్వాత జరిగిందా? అన్నది నిర్ధారించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. ‘‘అభయ్ కిడ్నాప్, హత్యకు సంబంధించి అనేక కీలకాధారాలు సేకరించాం. నిందితుల కోసం పది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరో 24 గంటల్లో కేసును పూర్తిగా కొలిక్కి తెస్తాం’’ అని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం ‘సాక్షి’తో అన్నారు.
కిడ్నాప్ చేశారిలా..
రాజమండ్రికి చెందిన శేషు అలియాస్ సాయి దిల్‌సుఖ్‌నగర్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్‌నగర్ కేంద్రంగా పని చేసే కార్తికేయ కన్సల్టెన్సీ ద్వారా ఓ వృద్ధాశ్రమంలో బాయ్‌గా చేరాడు. కొన్నాళ్ల పాటు ఈ ఉద్యోగం చేసిన శేషు.. తిరిగి రాజమండ్రి వెళ్లిపోయాడు. ఆర్నెలల తర్వాత మళ్లీ హైదరాబాద్ వచ్చి అభయ్ తండ్రి రాజ్‌కుమార్ ఇంటి సమీపంలోనే ఉండే ప్రదీప్ థాకర్ అనే ప్లాస్టిక్ వ్యాపారి ఇంట్లో పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే అభయ్‌తో పరిచయం పెంచుకొన్నాడు. చాలీచాలని వేతనంతో కష్టంగా మారడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించాడు. ఏపీకి చెందిన మరో ముగ్గురితో కలిసి అభయ్ కిడ్నాప్‌కు పథక రచన చేశాడు.
వీరంతా కలిసి తొలుత అభయ్‌ని అతడి స్కూల్ నుంచే కిడ్నాప్ చేయాలని భావించినా అది కుదరకపోవడంతో ఇంటి సమీపం నుంచి అపహరించాలని నిర్ణయించుకున్నారు. టిఫిన్ కోసం బయటకు వచ్చిన అభయ్‌ని మాటల్లో పెట్టిన శేషు.. అతడి స్కూటీ పైనే దారుస్సలాం వరకు తీసుకువెళ్లాడు. అక్కడ మిగిలిన నిందితులతో కలిసి ఆటోలోకి మార్చాడు. తర్వాత అభయ్ హత్య, పార్శిల్ చేసి సికింద్రాబాద్‌లో వదిలేయడం, రాజ్‌కుమార్‌కు ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేయడం చేశారు. తర్వాత సికింద్రాబాద్ నుంచి రైల్లో విజయవాడ మీదుగా పారిపోయారు.