'జీరో పాయింట్లుతో హీరోగా ఉండండి'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా, పోలీసు శాఖలు నెగిటివ్ పాయింట్ల విధానాన్ని మంగళవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను ఇక జరిమానాలతో సరిపెట్టరు. ప్రతి తప్పిదానికి నిర్దేశించిన మేరకు నెగిటివ్ పాయింట్లు విధిస్తారు. అలా 12 పాయింట్లు దాటితే లైసెన్సు రద్దే. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ కచ్చితమైన నిబంధనల ప్రకారం నడిచేలా చూసేందుకు దేశంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమలవుతోంది. ఇక్కడా పటిష్టంగా దీనిని అమలు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగేలా చూడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నెగిటివ్ పాయింట్ల విధానం అమలు నేపథ్యంలో డీజీపీ అనురాగ్ శర్మ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. 'జీరో పాయింట్లు మెయింటెన్ చేస్తూ హీరోగా ఉండండి. 12 పాయింట్ల పెనాల్టీ వ్యవస్థ ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో అమల్లోకి వస్తుంది' అని తెలంగాణ డీజీపీ అధికారిక ఖాతా ట్వీట్ చేసింది.
నెగిటివ్ పాయింట్ల విధానం ఈ విధంగా ఉంటుంది..
- ప్రజా రవాణా వాహనాలు నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే: 5పాయింట్లు
- దోపిడీలు, స్నాచింగ్లకు వాహనాలు ఉపయోగిస్తే: 5పాయింట్లు
- రోడ్డు ప్రమాదంలో బాధితులు మరణిస్తే: 5 పాయింట్లు
- మద్యం సేవించి కార్లు, భారీ వాహనాలు నడిపితే: 4 పాయింట్లు
- ద్విచక్ర వాహనాలు నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే: 3 పాయింట్లు
- వేగం పరిమితి గంటకు 40 కిలోమీటర్లు ఉండి.. మితిమీరితే: 3 పాయింట్లు
- రేసింగ్, మితిమీరిన వేగంతో వెళితే: 3 పాయింట్లు
- నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను వాహనాల్లో తరలిస్తే: 2 పాయింట్లు
- రాంగ్ సైడ్ డ్రైవింగ్: 2 పాయింట్లు
- రోడ్డు నిబంధనలు పాటించకుండా వాయు, శబ్ధ కాలుష్యం వెదజల్లే వాహనాలకు: 2 పాయింట్లు
- వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేకుండా నడిపితే: 2 పాయింట్లు
- రోడ్డు ప్రమాదంలో బాధితులు గాయాలపాలైతే: 2 పాయింట్లు
- ఆటోలో డ్రైవర్ పక్కన మరొకరిని కూర్చోబెట్టుకుంటే: 1 పాయింట్
- సీటు బెల్టు, హెల్మెట్ పెట్టుకోకపోతే: 1 పాయింట్
Maintain Zero and still be a Hero. 12 point penalty system comes into force in Hyderabad from today. @MORTHIndia @HMOIndia @IPS_Association
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) 1 August 2017