గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కామ్ ద్వారా 156 పారామెడికల్ పోస్టుల భర్తీకి అనుమతి లభించిందని...
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కామ్ ద్వారా 156 పారామెడికల్ పోస్టుల భర్తీకి అనుమతి లభించిందని కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం సచివాలయం లో మాట్లాడుతూ.. సౌదీ అరేబియాలోని ప్రముఖ ఆస్పత్రుల్లో నర్సింగ్, పారామెడికల్ ఉద్యోగాలకు అర్హులు http://www.tomcom.telangana.gov.in ద్వారా అక్టోబర్ 5లోగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా కూడా విద్యార్హతలు, అనుభవం, పాస్‌పోర్ట్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు.
నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజి యోథెరపిస్ట్ ఉద్యోగాలకు అర్హతలు, అనుభవాన్ని బట్టి రూ.50 వేలకు తగ్గకుండా నెల వేతనం లభిస్తుందన్నారు. పారామెడికల్ పోస్టులే కాక ఇతర ఉద్యోగాలకూ టామ్‌కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అవకాశాలుంటే వారికి సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ సంస్థ యాజమాన్యంతో హైదరాబాద్ నుంచే నేరుగా ఇంటర్వ్యూను టామ్‌కామ్ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి యాజమాన్యాలే ఉచిత వసతి, ప్రయాణ ఖర్చులు భరిస్తాయని నాయిని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-23342040, 8886882040లో టామ్‌కామ్ ప్రతినిధులను సంప్రదించవచ్చన్నారు.