నగరం..పల్లె'టూర్' | 16 lakh people from hyderabad returns to home town | Sakshi
Sakshi News home page

నగరం..పల్లె'టూర్'

Published Fri, Jan 15 2016 2:10 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

నగరం..పల్లె'టూర్' - Sakshi

నగరం..పల్లె'టూర్'

సొంతూళ్లకు వెళ్లిన 16 లక్షల మందికి పైగా ప్రజలు
 * అరకొర రైళ్లు, బస్సులతో జనం ఇక్కట్లు
 * అదనపు చార్జీలు వసూలు చేసినా సరిపడా బస్సులు నడపని ఆర్టీసీ
 * కిందటేడాది కంటే తగ్గిన రైళ్లు, బస్సులు
 * రోడ్డెక్కిన వెయ్యి ప్రైవేటు బస్సులు..అడ్డగోలు చార్జీలతో దోపిడీ


 సాక్షి, హైదరాబాద్: మహానగరం సంక్రాంతికి తరలివెళ్లింది. నగరవాసులు భారీ సంఖ్యలో సొంతూళ్లకు పయనమయ్యారు. స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వరుసగా సెలవులు రావడంతో బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో సుమారు 16 లక్షల మందికిపైగా పల్లెలకు తరలివెళ్లారు. టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ మధ్య సమన్వయ లోపం కారణంగా రద్దీకి అనుగుణంగా బస్సులను నడపలేకపోయారు. రెండు ఆర్టీసీ సంస్థలు పండుగ సందర్భంగా స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసినా... అరకొర బస్సులే నడపడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేట్ బస్సులు రెట్టింపు చార్జీలు గుంజుతూ ప్రయాణికుల జేబుల్ని గుల్ల చేశాయి.

మూడు, నాలుగు రోజులుగా రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడటంతో చాలామంది ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు, టాటా ఏసీలు, సొంత కార్ల వైపు మొగ్గుచూపారు. రైళ్లల్లో రిజర్వేషన్‌లు లభించకపోవడంతో  చాలా మంది ప్యాసింజర్ రైళ్లల్లో బయల్దేరారు. జనరల్ బోగీల్లో నిలుచునేందుకు కూడా చోటు లభించక గంటల తరబడి  నరకం చవిచూశారు. పిల్లలు, పెద్దలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకు ప్రజలు పెద్దఎత్తున తరలి వెళ్లారు.

 గతేడాది కంటే తగ్గిన రైళ్లు, బస్సులు
 రోజువారీగా బయల్దేరే 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాకుండా, వివిధ ప్రాంతాల మధ్య సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 27 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. గత సంవత్సరం సుమారు 50 రైళ్లను అదనంగా నడపగా ఈ సారి వాటి సంఖ్యను తగ్గించారు. రద్దీ మార్గాల్లో పలు ప్రధాన రైళ్లకు అదనపు  బోగీలను ఏర్పాటు చే సి చేతులు దులుపుకున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయనగరం,శ్రీకాకుళం, వైజాగ్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వ చ్చింది. హైదరాబాద్ నుంచి వైజాగ్, శ్రీకాకుళం వైపు ప్రత్యేక రైళ్లు నడపడంలో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్‌ల మధ్య సమన్వయం కొరవడడంతో అదనపు రైళ్లు అందుబాటులోకి రాలేదు. రెండు ఆర్టీసీ సంస్థల మధ్య సమన్వయ లేమి వల్ల కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. గత సంవత్సరం సుమారు 5 వేల ప్రత్యేక బస్సులను నడిపితే ఈ ఏడాది రెండు ఆర్టీసీ సంస్థలు కలిపి 4 వేల బస్సులను కూడా నడపలేకపోయాయి. దీంతో సుమారు వెయ్యి ప్రైవేట్ బస్సులు రోడ్లెక్కాయి.
 ఇదీ లెక్క..
 ఈ నెల 11, 12, 13 తేదీల్లో ప్రజలు తరలి వెళ్లారిలా..
 - మూడ్రోజుల్లో రైళ్లలో రోజుకు 2 లక్షల చొప్పున 6 లక్షల మంది బయల్దేరారు
 - ఆర్టీసీ బస్సుల్లో సుమారు 4 లక్షల మంది వెళ్లారు
 - వెయ్యి ప్రైవేట్ బస్సుల్లో రోజుకు 40 వేల మంది చొప్పున మూడ్రోజుల్లో 1.2 లక్షల మంది వెళ్లారు
 - ఇవి కాకుండా సుమారు లక్ష వరకు కార్లు, ఇతర వాహనాల్లో దాదాపు 5 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లి ఉంటారని అంచనా
 - మొత్తంగా సుమారు 16 లక్షల మందికి పైగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి వెళ్లినట్లు అంచనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement