అమరావతి : సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పట్నం బస్సులన్నీ పల్లెకు పరుగుతీస్తాయి. డిమాండ్‌ని బట్టే ధర అన్నట్లు... బస్సు ఛార్జీలకు ఉన్నట్టుండి రెక్కలొచ్చేశాయి. ప్రజా శ్రేయస్సు అని చెప్పుకునే ఆర్టీసీ కూడా... ట్రావెల్స్‌కు ఏమాత్రం తగ్గకుండా టిక్కెట్ చార్జీలను వసూలు చేస్తోంది. సంక్రాంతి పండగకు రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి 2,500 ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసినట్లు ఆర్భాటంగా ప్రకటించిన ఆర్టీసీ... 50 శాతం అదనపు ఛార్జీలతో పాటు రిజర్వేషన్ చార్జీలు తదితరాలన్నీ కలిపి 75 శాతం వరకు అదనంగా టిక్కెట్ ధరపై వసూలు చేస్తోంది.
ఈ నెల 11 నుంచి 17 వరకు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం ద్వారా రిజర్వేషన్లు అందుబాటులో ఉంచింది. ఇప్పటికే ఫ్లెక్సీ ఫేర్ విధానంలో ప్రయాణికుల నుంచి దోచుకున్న ఆర్టీసీ సంక్రాంతి పండక్కి ప్రత్యేక బాదుడుకు తెగబడింది. అదనంగా చార్జీలు వసూలు చేయబోమని రవాణ శాఖ మంత్రి ప్రకటించినా దాంతో తమకు సంబంధం లేదని, బాదుడు బాదుడేనని ఆర్టీసీ స్పష్టం చేస్తోంది. దీంతో ఆర్టీసీ బాదుడు చూసి ప్రైవేట్ ఆపరేటర్లు మరింత రెచ్చిపోతున్నారు. టిక్కెట్ ధరపై 200 నుంచి 300 శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి.
ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు టిక్కెట్ల ధరలు పెంచకుండా నియంత్రిస్తామని, టిక్కెట్ల ధరలు పెంచితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇటీవలే మంత్రి శిద్ధా రాఘవరావు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తనిఖీల పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ జోలికెళ్లొద్దని రవాణా శాఖ అధికారులకు సర్కారు నుంచి మౌఖిక ఆదేశాలందినట్లు సమాచారం. పండగ సీజన్‌లో ప్రైవేట్ ట్రావెల్స్‌పై తనిఖీలు చేస్తే... అంతిమంగా ప్రయాణికులే ఇబ్బందులకు గురవుతారని, ప్రయాణానికి ఆటంకాల్లేకుండా చూడాలని సర్కారు పెద్దల ఆదేశాలు ఉన్నాయట. దీంతో సాధారణ ధరలు కూడా రెట్టింపైపోయి ప్రయాణికులను వణికిస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్ ఏసీ టిక్కెట్ ధర సాధారణంగా రూ.300 వరకు ఉంటే, ప్రస్త్తుతం ప్రైవేటు ట్రావెల్స్ రూ.700 నుంచి రూ.900 వరకు వసూలు చేస్తున్నాయి. తిరుపతికి రూ.1,700 వరకు దోచేస్తున్నాయి. ఇదిలాఉండగా తాజాగా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు కొత్త ఎత్తుగడ వేశారు. ఆయా జిల్లాల్లో రవాణా శాఖకు టూరిస్ట్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. బస్సులో 42 సీట్లుంటే టికెట్ల ధరలను ఆన్‌లైన్‌లో ఉంచి ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నారు. సర్కారే వ్యాపార ధోరణితో వ్యవహరిస్తుంటే... ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. సంక్రాంతి సీజన్‌లో ప్రయాణికుల నుంచి అదనంగా రూ.20 కోట్ల మేర వసూలు చేసేందుకు ఆర్టీసీ టార్గెట్ పెట్టుకోవడం గమనార్హం.
ఆర్టీసీకి పండుగ, ప్రయాణికులకు మోత
Published Tue, Jan 10 2017 6:44 PM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement
Advertisement