29 ఏళ్ల యువకుడికి..16 ఏళ్ల కుర్రాడి గుండె!
కేర్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్: గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కేర్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ సోమరాజు, గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ రాజశేఖరరావు, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బీకేఎస్ శాస్త్రి శుక్రవారమిక్కడ వివరాలు వెల్లడించారు. బెంగళూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంతోష్ సుధీర్ సంఘవీకర్ (29) ఏడాదిన్నరగా హృద్రోగంతో బాధ పడుతున్నారు. విపరీతమైన ఆయాసంతో పాటు 4 అడుగుల దూరం కూడా నడవలేని పరిస్థితి. చికిత్స కోసం 6 మాసాల క్రితం నాంపల్లి కేర్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించారు. గుండె కండరాలు బలహీనంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటికే స్టంట్ వేసి ఉండటంతో గుండె మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు.
నిజామాబాద్ విద్యార్థి గుండె దానం: ఇదే సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఈ నెల 7న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నల్లగండ్ల కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమించడంతో వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. వైద్యుల సూచన మేరకు విద్యార్థి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు.
26 కిలోమీటర్లు..13 నిమిషాల్లో : జీవన్‌దాన్ ద్వారా సమాచారం అందుకున్న కేర్ వైద్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకున్నారు. 26 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రి నుంచి దాత గుండెను అంబులెన్స్‌లో తరలించాలని నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసుల సహాయంతో 13 నిమిషాల్లోనే నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం 20 మంది వైద్యుల బృందం ఐదున్నర గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. గుండెను సేకరించిన 76 నిమిషాల్లోనే రక్త సరఫరాను పునరుద్ధరించినట్లు డాక్టర్ కేవీ రాజశేఖరరావు తెలిపారు. 2004 జూన్‌లో తొలిసారి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన తరువాత ఆస్పత్రిలో ఈ తరహా శస్త్రచికిత్స చేయడం మళ్లీ ఇదేనన్నారు. ప్రస్తుతం సంతోష్ కోలుకోవడంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.