24/7తో పక్కాగా వెరిఫై | 24/7, with the perfect verifying | Sakshi
Sakshi News home page

24/7తో పక్కాగా వెరిఫై

Published Fri, Jan 1 2016 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

24/7తో  పక్కాగా వెరిఫై

24/7తో పక్కాగా వెరిఫై

ఆధునిక సాఫ్ట్‌వేర్ అందిపుచ్చుకున్న పోలీసులు  
19 వేల కోర్టుల్లోని డేటాతో అనుసంధానం
మౌస్ క్లిక్‌తో నేరగాళ్ల పూర్తి వివరాలు సైతం      
పాస్‌పోర్ట్స్ నుంచి వారెంట్స్ వరకు తనిఖీ

 
మల్టీనేషనల్ కంపెనీలతో పాటు కొన్ని కీలక సంస్థల్లో ఉద్యోగాల్లో చేరే వారికి పోలీసులు జారీ చేసే పరిశీలన పత్రం (వెరిఫికేషన్ సర్టిఫికెట్) ఎంతో కీలకం. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చాల్సి వస్తోంది. ఇది అటు దరఖాస్తుదారుడికి, ఇటు అధికారులకూ ఇబ్బంది కరంగా మారింది. కొందరు అభ్యర్థులు నిర్దేశిత గడువు మీరడంతో ఉద్యోగం నిలుపుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు.
     
విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన అనేక మంది నగరానికి వలసవస్తున్నారు. వీరిలో కొందరు నేరచరితులూ ఉంటున్నారు. స్థానికంగా గుర్తింపు పత్రాలు పొందుతున్న వీరంతా వాటి ఆధారంగా పాస్‌పోర్ట్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో వీరికి ఉన్న నేరచరిత్ర ఇక్కడి అధికారులకు తెలియకపోవడంతో పాస్‌పోర్ట్‌లు వచ్చేస్తున్నాయి. అర్దరాత్రి వేళ నగరంలో సంచరిస్తున్న ఓ వ్యక్తిని అనుమానంపై పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అతడు తన వద్ద ఉన్న గుర్తింపుకార్డులు చూపించి బయటకు వచ్చేస్తాడు. ఇలాంటి వారిలో నేరగాళ్లు ఉండే అవకాశం లేకపోలేదు. ఈ విషయం తెలియాలంటే సదరు అనుమానితుడిని లోతుగా విచారించాలి. ఇది కొన్ని సందర్భాల్లో అమాయకులకు ఇబ్బందికరంగా మారే ప్రమాదమూ ఉంది.
 
ఇకపై ఇలాంటి సమస్య ఎదురుకాకుండా, ఈ తరహా పరిస్థితులు ఉత్పన్నం కాకుండా నగర పోలీసు విభాగం అత్యాధునిక సాఫ్ట్‌వేర్ టూల్‌ను అభివృద్ధి చేసింది. ‘24/7 వెరిఫై’గా పిలిచే ఈ సాఫ్ట్‌వేర్ ఎంతో ఉపయుక్తంగా మారింది. ఇది అమలులోకి రావడంతో సిటీ పోలీసు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సెల్ కీలకపాత్ర పోషించింది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వివరాలు వెరిఫై చేయడమే కాకుండా దానికి సంబంధించిన కొన్ని రికార్డులూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 - సాక్షి, సిటీబ్యూరో
 
ఏమిటీ ‘వెరిఫై’?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ-కోర్ట్స్ విధానం అమలులో ఉంది. వివిధ సివిల్, క్రిమినల్ న్యాయస్థానాల్లో ఉన్న కేసులకు సంబంధించిన సమగ్ర వివరాలను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంట ర్ (ఎన్‌ఐసీ) క్రోడీకరిస్తోంది. వీటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోకి చేరుస్తూ ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 19 వేల కోర్టులకు సంబంధించిన ఏడున్నర కోట్లకు పైగా రికార్డులతో కూడిన డేటాబేస్ ఏర్పాటైంది.  ఆయా న్యాయస్థానాల్లో ట్రయల్ పెండింగ్, ట్రయల్ దశ, వీగిపోయిన, శిక్షపడిన, రాజీ కుదిరిన కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని ఆధారంగానే ‘వెరిఫై’ సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించారు. ఆయా కేసుల్లో నిందితులుగా, పిటిషనర్లుగా ఉన్న వారి పేర్లు, ఇతర వివరాలతో కూడిన ప్రత్యేక డేటాబేస్‌కు సెర్చ్ ఇంజన్ అనుసంధానించారు. ఓ వ్యక్తి పేరు ఎంటర్ చేసి, సెర్చ్ చేస్తే చాలు... దేశ వ్యాప్తంగా అతడిపై ఉన్న కేసుల వివరాలు, వాటి పూర్వాపరాలు నిమిషాల్లో తెలిసిపోతాయి. ట
 
పోలీసు డేటాతో అనుసంధానం...

పోలీసు విభాగానికి పూర్తిస్థాయిలో ఉపయుక్తంగా ఉండాలంటే ఈ వెరిఫై సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని వివరాలతో కూడిన డేటాబేస్ అవసరమని నగర పోలీసు విభాగం నిర్ణయించింది. దీనికోసం పోలీసు డేటాతోనూ అనుసంధానం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే గడిచిన ఏడేళ్ల గణాంకాలను విశ్లేషించి, క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు క్రిమినల్ డేటాబేస్‌ను ఏర్పాటు చేశారు. రిపీటెడ్ అఫెండర్స్ (పదే పదే నేరాలు చేసే వారు)లో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. దీన్నే సాంకేతికంగా మోడెస్ ఆపరెండీ అంటారు. దీని ఆధారంగానూ ప్రాథమిక జాబితాను రూపొందించారు.  దీన్నే మరిం తగా విశ్లేషిస్తూ ఆయా నేరగాళ్లలో ఇప్పటి వరకు ఎవరు ఎన్నిసార్లు అరెస్టయ్యారు? ఆ కేసులు ఏ కోర్టులో, ఏ స్థితిలో ఉన్నాయి? అనేవి తయారు చేస్తున్నారు. కేవలం నగరానికి సంబంధించిన వివరాలే ప్రస్తుతం అందుబాటులో ఉండగా... ఈ నేరగాళ్లపై ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేసుల్నీ ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా అప్‌డేట్ చేయాలని నిర్ణయించారు. ఈ మొత్తం డేటాబేస్‌ను ‘వెరిఫై’తో అనుసంధానిస్తారు.
 
ఇంట్రానెట్ ద్వారా అన్ని ఠాణాలకు...

‘వెరిఫై’ని అన్ని పోలీసుస్టేషన్లకూ కనెక్టివిటీ కలిగి ఉండే ఇంట్రానెట్‌తో అనుసంధానించారు. ఫలి తంగా ప్రస్తుతం ఒకచోట మాత్రమే ఉంటున్న ఈ డేటా డివిజన్, జోనల్, పోలీసుస్టేషన్లతో పాటు ప్రత్యేక విభాగాలకూ అందుబాటులోకి వచ్చిం ది. ప్రస్తుతం నగర పోలీసులు నేరగాళ్లపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగిస్తున్నారు. ఇలా చేయాలంటే సదరు నేరగాడిపై మూడు, అంతకు ఎక్కువ కేసులుండాలి. అయితే నగరంలో చిక్కుతున్న ఇతర రాష్ట్రాల వారి గత చరిత్ర తెలియకపోవడం అనేక మంది తప్పించుకుంటున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఇది సాధ్యమవుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఎస్బీ విభాగం పాస్‌పోర్ట్స్ వెరిఫికేషన్ పక్కాగా చేయడానికి వీలుకలిగింది.
 
వెరిఫికేషన్ సైతం తేలిగ్గా....
పూర్తిస్థాయిలో అప్‌డేట్ అయిన ‘వెరిఫై’ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వస్తే పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి తక్షణం అవి అం దించే అవకాశం ఏర్పడుతుంది. దీనికంటే ముఖ్యంగా ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నివేదికలు రూపొందించి దరఖాస్తుదారులకు ఉద్యోగాలు ఇచ్చే వారికి సమర్పించే అవకాశం చిక్కుతుంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ గార్డులుగా, పని మనుషులుగా, డ్రైవర్లుగా చేరే వారు పలు నేరాలు చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి వారిలో అత్యధిక శాతం నేర చరిత్ర కలిగిన వారే ఉంటున్నారు. ‘వెరిఫై’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే యజమానులు సైతం పోలీసులను ఆశ్రయించి తమ వద్ద ఉద్యోగాల్లో చేరే వారి వివరాలను సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.
 
ఎన్‌బీడబ్ల్యూలను ‘దాచలేరు’...
క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల పని తీరును కొలవడంలో నాన్-బెయిలబుల్ వారెంట్ల (ఎన్‌బీ డబ్ల్యూ) ఎగ్జిక్యూషన్ సైతం ప్రధానమైంది. కోర్టుల్లో కేసుల విచారణ త్వరితగతిన సాగాల న్నా, పెండెన్సీ తగ్గాలన్నా ఎన్‌బీడబ్ల్యూలు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఈ నేపథ్యంలోనే నిత్యం ఉన్నతాధికారులు వీటి పెండెన్సీని పర్య వేక్షిస్తుంటారు. దీనికోసం ఇప్పటి వరకు ప్రత్యేక సాంకేతిక విధానం అందుబాటులో లేదు. దీంతో పోలీసుస్టేషన్లకు చెందిన అధికారులు చెప్తున్న గణాంకాల పైనే ఆధారపడాల్సి వస్తోం ది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఐటీ సెల్ ఈ ‘వెరిఫై’లో వారెంట్స్ కోసం ఓ కార్నర్ ఏర్పాటు చేసింది.
 
పూర్తి వివరాలు తెలియకున్నా...
ఎవరి వివరాలైతే తెలుసుకోవాలని పోలీసులు భావి స్తున్నారో వారి పూర్తి పేరు, ఇతర వివరాలు తెలియకున్నా ‘వెరిఫై’ ద్వారా సెర్చ్ చేయవచ్చు. అయితే అతడి పేరుతో కొంత భాగాన్ని మాత్రమే టైప్ చేసి ప్రయత్నిస్తే వచ్చే రికార్డుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పేరు, చిరునామా, కేసు నమోదైన చట్టాలు, కేసు తరహా, ఫైలింగ్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్‌ల్లో ఏ ఒక్కటి తెలిసినా ఈ సెర్చ్ తేలికై డాక్యుమెంట్లను వీలైనంత త్వరగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాల్లోని కోర్టుల్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల స్థితిగతుల్నీ తెలుసుకునే అవకాశం ఇందులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement