తగ్గిన లబ్ధి‘దారులు’!
- 25 శాతం తగ్గిపోయిన ‘ఆరోగ్య లక్ష్మి’ లబ్ధిదారులు
- అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాల కట్టడికి స్పాట్ ఫీడింగ్ నిబంధన
సాక్షి, హైదరాబాద్: గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తలపెట్టిన ఆరోగ్య లక్ష్మి కార్యక్రమ లబ్ధిదారులు తగ్గిపోయారు. ఆరోగ్య లక్ష్మి లబ్ధిదారులు తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రానికి హాజరైతేనే పౌష్టికాహారాన్ని అందించాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకురావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. పథకంలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఈ నిబంధనను తీసుకురావడంతో లబ్ధిదారుల హాజరుశాతం భారీగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో 5.21 లక్షల మంది గర్భిణు లు, పాలిచ్చే తల్లులు నమోదయ్యారు. ఈ పథకం కింద రోజూ పాలు, ఉడికించిన కోడిగుడ్డుతోపాటు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు తదితరాలతో కూడిన పౌష్టికాహారాన్ని భోజన రూపంలో అందిస్తున్నారు.
వారంలో ఓరోజు 200 మిల్లీలీటర్ల పెరుగు, ఎగ్ కర్రీ పంపిణీ చేస్తున్నారు. గతంలో లబ్ధిదారులు ఈ ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్లే వీలుండేది. స్పాట్ ఫీడింగ్ నిబంధన కఠినతరం చేయడంతో లబ్ధిదారులు కేంద్రంలో హాజరై అక్కడే భోజనం చేయాలి. రోజువారీగా హాజరైన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలి. ఉన్నతాధికారులు ఈ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని మహిళా సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధన అమలుతో హాజరు శాతం భారీగా తగ్గినట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జూలైలో రాష్ట్రవ్యాప్తంగా 3.72 లక్షల మంది హాజరయ్యారు. గైర్హాజరవుతున్నారు.
అంతకుముందు.. ఆ తర్వాత...: ఆరోగ్య లక్ష్మి పథకం అమలులో కఠిన నిబంధనలకు ముందు 5.11 లక్షల మంది లబ్ధిదారులు పౌష్టికాహారాన్ని తీసుకుంటుండగా.. నిబంధనలు అమల్లోకి వచ్చిన 3 నెలల నుంచి సగటున 1.5 లక్షల మంది గైర్హాజరు కావడం ఆ శాఖలో చర్చకు దారితీస్తోంది. తప్పనిసరి హాజరు, ఆకస్మిక తనిఖీలు, హాజరుశాతాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలను కట్టడిచేసినట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గతంలో ఇంటికి సరుకులు తీసుకెళ్లే వెసులుబాటు ఉన్నప్పుడు 90 శాతానికి పైగా హాజరు ఉం డటం.. తాజా నిబంధనలతో ఏకంగా 25% పడిపోవడంతో ఈ పథకంలో అక్రమాలు భారీగా ఉన్నట్లు ఆ శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది. పథకం అమలులో క్రమం తప్పకుండా పర్యవేక్షించడంతో పాటు నిఘాను కట్టుదిట్టం చేసేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సాంకేతిక పరిజ్ఞానంతో యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.