అభాసుపాలవుతున్న ‘ఆరోగ్యలక్ష్మి’
అంగన్‌వాడీలకు రెండున్నరనెలలుగా నిలిచిన కందిపప్పు సరఫరా
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందని
పౌష్టికాహారం పట్టించుకోని అధికారులు
ఘట్‌కేసర్ టౌన్: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం ఆరంభ శూరత్వంగా మారింది. మాతాశిశు మరణాలను తగ్గిం చడానికి షౌష్టికాహారం అందించాలని 2015 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకపూట సం పూర్ణ భోజనం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. హయత్‌నగర్ ప్రాజెక్టులో 243 కేంద్రాల ద్వారా సుమారు 10,300 వేలకు పైగా బాలింతలు, గర్భిణిలు వన్ ఫుల్‌మీల్స్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో గర్భిణిగా నమోదైనప్పటి నుంచి పుట్టిన సంతానం ఆరు నెలల వయస్సు వచ్చేం తవరకు ఈ భోజనాన్ని అందిస్తారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం గర్భిణిలు, బాలింతలకు నిత్యం కూరగాయలు, పాలు, గుడ్లతో పాటు రోజూ 40 గ్రాముల కందిపప్పు, చిన్నారులకు 15 గ్రాముల కంది పప్పును భోజనంలో వడ్డించాలి.
కనిపించని కందిపప్పు..
అధికారుల సమన్వయం లోపం గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల పాలిట శాపంగా మారింది. అధికారుల ముందుచూపు కరువవడంతో అంగన్‌వాడీ కేం ద్రాలకు సుమారు మూడు నెలలుగా కంది పప్పు సరఫరా నిలిచిపోయింది. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహా రానికి దూరం అవుతున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో కడుపు నిండా విటమిన్లతో కూడిన పౌష్టికాహారం అందితే కడుపులో ఉన్న బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉంటారు. దీంతో మాతాశిశు మరణాలు తగ్గుతాయని ప్రభుత్వం భావించింది. కంది పప్పు సరఫరా కాకపోవడంతో కొనుగోలు చేసి వడ్డించాలని అధికారులు అంగన్‌వాడీ సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంగన్‌వా డీ సిబ్బంది కొనుగోలు చేసిన అరకొర పప్పుతో పౌష్టికాహారం ఎలా అందుతుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నా రు. ఈ విషయమై అంగన్‌వాడీ సూపర్‌వైజర్ యశోదను వివరణ కోరగా సరి పోను కందిపప్పు నిల్వలు లేని కారణం గా అందించ లేకపోయామని, వారం రోజుల్లో సరఫరా చేస్తామని తెలిపారు.