పోలింగ్ 37 శాతమే..
సాయంత్రం 4.30 గంటల వరకు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగలేదు. 2009 ఎన్నికల తో పోలిస్తే ఈసారి కొంత తగ్గింది. 2009లో 42.92 శాతం పోలింగ్ నమోదు కాగా.. మంగళవారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 4.30 గంటల వరకు 37.70 శాతం మాత్రమే నమోదైంది. సర్కిళ్ల నుంచి పూర్తి సమాచారం అందకపోవడంతో బుధవారం తుది ఓటింగ్ శాతాన్ని వెల్లడించనున్నట్లు జీహెచ్‌ఎంసీ వర్గాలు ప్రకటించాయి. అంతకుముందు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సుమారు 45 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించినా.. ఆ తర్వాత 37.70 శాతమే అని అధికారులు తెలిపారు.
ఆదిలో ప్రశాంతం.. చివర్లో ఘర్షణలు
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగినప్పటికీ చివరల్లో ఘర్షణలు చోటుచేసుకున్నారు. మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాలకుగాను తొమ్మిది కేంద్రాల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో ఆయా చోట్ల కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. 15 నిమిషాల్లోనే కొత్త పరికరాలు అందుబాటులోకి తేవడంతో పోలింగ్ సజావుగా సాగింది. ఎనిమిది కేంద్రాల్లో లో బ్యాటరీతో ఈవీఎంలు మొరాయించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరోవైపు వెబ్‌సైట్, మొబైల్ యాప్స్ ద్వారా ఓటరుస్లిప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడంలో కనిపించిన స్పందన పోలింగ్‌లో కనిపించలేదు. పోల్‌స్లిప్‌ల డౌన్‌లోడ్‌లు, జీహెచ్‌ఎంసీ పంపిణీ చేసిన పోల్‌స్లిప్‌లను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి 60 శాతానికి పైగా పోలింగ్ నమోద వుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటర్ల నుంచి స్పందన కనిపించలేదు.
వెబ్‌కాస్టింగ్‌తో అంతా సజావుగా..
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును ఎన్నికల సంఘం, నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం, జీహెచ్ ఎంసీ కార్యాలయాల నుంచి పర్యవేక్షించారు. దీంతో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పోలింగ్ జరగడమే కాక, అక్కడక్కడ తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కొన్నిచోట్ల చెలరేగిన ఘర్షణలు పోలింగ్ కేంద్రాల్లోకానీ, కేంద్రాలకు వంద మీటర్ల లోపు కానీ జరిగినవి కావని ఆయన పేర్కొన్నారు. అయినా.. ఆ ఘర్షణలతో ప్రజలు భయభ్రాంతులకు గురైనట్లు ,రిగ్గింగ్ జరిగినట్లు, ప్రిసైడింగ్, రిటర్నింగ్ అధికారులు నివేదిస్తే ఎన్నికల సంఘానికి తెలియజేసి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రేటర్‌లోని ఐదు జోన్లలో సౌత్ జోన్లో ఎక్కువ పోలింగ్ జరిగినట్లు తమకు సమాచారం ఉందన్నారు. పాతబస్తీ సౌత్‌జోన్ పరిధిలో ఉంది.
5వ తేదీన ఫలితాలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుందని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల కే తొలి ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండవచ్చని తెలిపారు.