సాయంత్రం 5 గంటల తర్వాత ఫలితాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాతే వెల్లడిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి చెప్పారు. ఓట్ల లెక్కింపు విషయమై ఆయన గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే కౌంటింగ్ మొదలవుతుందని, మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారని అన్నారు. అయితే.. పురానాపూల్‌లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీ పోలింగ్ ఉన్నందున.. అది ముగిసిన తర్వాత మాత్రమే మొదటి ఫలితాన్ని వెల్లడిస్తారని అన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, అందువల్ల కేవలం పాస్‌లు ఉన్నవారు మాత్రమే కేంద్రాల వద్దకు రావాలని జనార్దన రెడ్డి చెప్పారు. పాస్‌లు లేనివాళ్లు అక్కడకు రావల్సిన అవసరం లేదని, ఎటూ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఫలితాలను వెల్లడిస్తున్నందున ఆ కాంపౌండ్ వద్ద ఉన్నా, ఇంట్లో ఉన్నా తేడా ఏమీ ఉండబోదని చెప్పారు. ఈవీఎంలు వచ్చిన తర్వాత కౌంటింగ్ దగ్గర వివాదాలు ఏమీ ఉండబోవని, కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తామని ఆయన అన్నారు. అలాగే, ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు ఏవీ నిర్వహించకూడదని కమిషనర్ చెప్పారు.