
విద్యుదాఘాతాలకు 814 మంది బలి
⇒ రాష్ట్ర విద్యుత్ సలహా సంఘం ఆందోళన
⇒ చార్జీల పెంపుపై టీఎస్‌ఈఆర్సీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటేటా విద్యుత్ ప్రమాద మరణాలు పెరుగుతు న్నాయని రాష్ట్ర విద్యుత్ సలహా సంఘం (ఎస్‌ఏసీ) ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలతో 2015– 16లో 522 మంది, 2016–17 తొలి అర్ధ వార్షికంలో 292 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నిర్వహణ లోపాలతోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయ పడింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) కార్యాలయంలో మంగళ వారం ఎస్‌ఏసీ మూడో సమావేశం జరిగింది. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీని వాస రావు, ఎస్‌ఏసీ సభ్యుడు, ఫ్యాప్సీ అధ్యక్షుడు వెన్నెం అనిల్‌రెడ్డి, ప్రయాస్ ఎనర్జీ ç సభ్యుడు ఎన్.శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై అభిప్రాయ సేకరణ కోసం ఈఆర్సీ ఈ సమావేశం నిర్వహించినప్పటికీ విద్యుదాఘాత మరణాలపై ప్రధానంగా చర్చ జరిగింది. మానవ తప్పిదాలు, శాఖాపర లోపాలతో అత్యధిక విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని విద్యుత్ రంగ నిపుణులు ఎన్.శ్రీకుమార్‌తో పాటు పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. డిస్కంలు ఇంకా టారీఫ్ ప్రతిపాదనలు సమర్పించని నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించడం లేదా ఫుల్ కాస్ట్ టారిఫ్ ఉత్తర్వులు జారీ చేయడం అంశాలపై సుమోటోగా నిర్ణయం తీసుకునే అధికారం ఈఆర్సీకి ఉందన్నారు.రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్ చార్జీల పెంపు హేతబద్ధంగా ఉండాలని ఫ్యాప్సీ అధ్యక్షుడు వెన్నం అనిల్‌రెడ్డి కోరారు.