సమసిపోని 'మా' ఎన్నికల వివాదం
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వివాదం ఇంకా సమసిపోలేదు. 'మా' ఎన్నికలపై నటుడు ఓ.కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొత్తగా ఎన్నికైన మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్, శివాజీ రాజాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
'మా' ఎన్నికలకు ముందు కోర్టులో పిటిషన్ - ఆ తరువాత వాడీవేడీ విమర్శలతో ఎన్నికలు జరగడం తెలిసిందే. మార్చి 29న ఎన్నికలు జరిగినా కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు నిలిపివేశారు. ఆ తరువాత కోర్టు అనుమతితో ఏప్రిల్ 17న ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేశారు. సమీప ప్రత్యర్థి జయసుధపై 85 ఓట్ల ఆధిక్యంతో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. కొత్తగా అధ్యక్షుడుగా ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్ 19న ప్రమాణస్వీకారం కూడా చేశారు.
మళ్లీ ఇప్పుడు నటుడు ఓ.కళ్యాణ్ 'మా' ఎన్నికలపై పిటిషన్ దాఖలు చేయడంతో రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, శివాజీ రాజాలకు నోటీసులు జారీ అయ్యాయి.