చిట్టితల్లీ... కళ్లు తెరువమ్మా..! | A tragedy of kid Ramya's death | Sakshi
Sakshi News home page

చిట్టితల్లీ... కళ్లు తెరువమ్మా..!

Published Mon, Jul 11 2016 3:20 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

చిట్టితల్లీ... కళ్లు తెరువమ్మా..!

చిట్టితల్లీ... కళ్లు తెరువమ్మా..!

- రమ్య మృతదేహం చూసి తల్లడిల్లిన తల్లి రాధిక
- అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు
 
 హైదరాబాద్ : ‘అమ్మా రమ్యా.. చిట్టి తల్లీ.. ఒక్కసారి కళ్లు తెరువమ్మా... ఒక్కసారి లేచి మాట్లాడమ్మా... నువ్వు లేకుండా ఇక నేనెందుకు బతకాలి’... బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి రమ్య మృతదేహాన్ని చూసి తల్లడిల్లిన కన్న తల్లి రాధిక రోదన ఇది. రాధిక ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న కుటుంబీకులు ఆఖరి నిమిషం వరకు రమ్య మృతిచెందిన వార్త తెలియనీయలేదు. ఉస్మానియా ఆస్పత్రిలో రమ్య మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షలకు తరలించే ముందు మాత్రమే చూపించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులు బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీలోని తాతయ్య సురేంద్రనాథ్ నివాసానికి చిన్నారి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. రమ్యను చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘అక్కకు ఏమైంది నాన్నా’ అంటూ రమ్య చెల్లెలు రష్మీ అమాయకంగా అడుగుతుంటే... అంతా బోరున విలపించారు. అంబర్‌పేట శ్మశానవాటికలో సాయంత్రం రమ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.

 చికిత్స పొందుతోందని చెప్తూ...
 పంజగుట్ట ఠాణా పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని పంజగుట్ట హిందూ శ్మశానవాటిక వద్ద ఈ నెల 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రమ్య చిన్నాన్న రాజేష్ అక్కడిక్కడే మరణించారు. చిన్నారితో పాటు తల్లి రాధిక తీవ్రంగా గాయపడగా.. మరో చిన్నాన్న రమేష్, తాత మధుసూదనాచారి క్షతగాత్రులయ్యారు. రాధిక యశోద ఆస్పత్రిలో, రమ్య కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది రోజుల పాటు కోమాలో ఉండి, మృత్యువుతో పోరాడిన రమ్య శనివారం తుదిశ్వాస విడిచింది. అయితే రాధిక ఆరోగ్య పరిస్థితి రీత్యా కుటుంబీకులు ఈ విషయం ఆమెకు తెలియనీయలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందనే చెప్పుకుంటూ వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి ముందు... యశోద ఆస్పత్రితో ఉన్న రాధికను అంబులెన్స్‌లో కేర్ ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చి, అసలు విషయం చెప్పారు. స్ట్రెచర్‌పై చిన్నారి మృతదేహాన్ని రాధిక ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చి చూపించారు. తీవ్ర గాయాలతో ఉన్న రాధిక... కుమార్తె మృతదేహాన్ని చూసి ‘చిట్టితల్లీ.. చిట్టితల్లీ’ అంటూ గుండెలవిసేలా రోదించడం అక్కడున్నవారందరినీ కదిలించింది.
 
 వాళ్లకు తగిన శిక్ష పడాలి
 ‘ఆ రోజు మేము మా కారులో నెమ్మదిగా వెళ్తున్నాం. తాగిన మైకంలో ఉన్న ఆరుగురు యువకులతో కూడిన మరో కారు అదుపు తప్పిన వేగంగా వచ్చి డివైడర్ పైనుంచి ఎగిరి మా కారుపై పడింది. నా మరిది రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు నా కూతుర్నీ కోల్పోయాను. ఈ ప్రమాదానికి కారకులైన వారికి తగిన శిక్ష పడాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దు.’     
     - రమ్య తల్లి రాధిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement