పోరాడి ఓడిన రమ్య
తొమ్మిది రోజుల చికిత్స అనంతరం మృతిచెందిన చిన్నారి
{పమాదం రోజే చిన్నాన్న మరణం
విజయ గణపతినగర్‌లో విషాదం
భీమారం : ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాలను వీధిన పడేసింది. ప్రమాదంలో కుటుంబ పెద్ద చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, తొమ్మిదేళ్ల వయసున్న మనుమరాలు(పెద్ద కుమారుడి కూతురు) తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ఇదే ప్రమాదంలో చిన్న కుమారుడు మృతి చెందగా, అతని కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. పెద్ద కోడలు కాళ్లు విరిగి మంచం పట్టింది. రెండో కుమారుడి కాలుకు ఐదు చోట్లు బలమైన గాయాలు కాగా, హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని విజయ గణపతి కాలనీకి చెందిన పమ్మి మధుసూదన్(65) ఎస్సారెస్పీలో రిటైర్డ్ డీఈఈ. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు వెంకటరమణ హైదరాబాద్‌లోని ఓప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇతనికి భార్య రాధిక, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రమ్య(9) సికింద్రాబాద్‌లోని సెయింట్స్ ఆన్స్ కళాశాలలలో మూడో తరగతి చదువుతోంది. రెండో కుమారుడు పమ్మి రమేష్ స్థానికంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. చిన్న కుమారుడు రాజేష్(30) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.నాలుగేళ్ల క్రితమే ఇతని వివాహం జరిగింది. ఇతడూ హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు తెలిపారు.
ఇల్లు మారేందుకు..
మధుసూదన్ పెద్ద కుమారుడు వెంకటరమణ గాయత్రినగర్‌లో ఉంటున్నాడు. కూతురు రమ్య మూడో తరగతి చదువుతోంది. ప్రతిరోజు పాప సికింద్రాబాద్‌కు రావడం ఇబ్బందిగా ఉందని భావించిన వెంకటరమణ దంపతులు.. పాఠశాల సమీపంలోనే ఇల్లు తీసుకోవాలనుకున్నారు. ఈ నెల 1న వ్యక్తిగత పనినిమిత్తం మధుసూదన్, రమేష్ హైదరాబాద్ వెళ్లారు. ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగి చిన్న కుమారుడు రాజేష్‌కు ఫోన్ చేశారు. అతడు కారులో స్టేషన్‌కు వచ్చాడు. అప్పటికే వెంకటరమణ భార్య రాధిక సెయింట్స్ ఆన్స్ స్కూల్ సమీపంలో ఇంటి అన్వేషణలో ఉంది. వీరు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి అద్దె ఇంటి కోసం వెతికారు. పాఠశాల ముగిసే సమయం దగ్గర పడడంతో వీరందరూ కారులోనే సెయింట్ ఆన్స్ స్కూల్ వద్దకు చేరారు. అక్కడి నుంచి రమ్యను తీసుకుని ఇంటికి బయల్దేరారు. అయితే పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు పల్టీ కొట్టి వీరి వాహనాన్ని ఢీకొంది. రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా, రమ్య కోమాలోకి వెళ్లింది. రాధిక రెండు కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి. రమేష్ కుడికాలుకు గాయమవగా,మధుసూదన్‌ఛాతి రిప్స్ విరిగాయి.
తాతా.. ఎప్పుడు వచ్చావ్ ?
ప్రమాదం జరిగిన కొద్ది సేపటికీ తానే అన్నయ్యకు వెంకటరమణకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు రమేష్ విలపిస్తూ చెప్పాడు. కాగా, రోడ్డు ప్రమాదంలో రమ్య మృతి చెందడంతో విజయ గణపతి నగర్ కాలనీలో విషాదం అలుముకుంది. వారం వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడాన్ని కాలనీ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.