చిన్నారికి కన్నీటి వీడ్కోలు
చిట్టితల్లి రమ్య మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచింది. ఈనెల 1వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని పంజగుట్ట హిందూ శ్మశానవాటిక ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ్య చిన్నాన్న రాజేష్ అక్కడిక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ రమ్యను కేర్ ఆస్పత్రికి, తల్లి రాధికను యశోద ఆస్పత్రికి తరలించారు. ఆదివారం కన్నబిడ్డను కడసారి చూసి తల్లి తల్లడిల్లిన తీరు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది.
అంబర్‌పేట: బంజారాహిల్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి రమ్య మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం కన్నుమూసింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ గారాలపట్టి ఇక తిరిగి రాని లోకాలు వెళ్లిపోయిందని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. బంధు, మిత్రులు, కాలనీవాసుల రోదనలతో అంబర్‌పేట డీడీ కాలనీ శోకసంద్రంగా మారింది. బంజారా హిల్స్‌లో జరిగిన ప్రమాదంలో జూబ్లీహిల్స్‌లో నివసించే వెంకటరమణ, రాధికల పెద్ద కుమార్తె రమ్య గాయపడ్డ విషయం తెలిసిందే. చికిత్సపొందుతూ రమ్య తుది శ్వాశ విడవడంతో పోస్టుమార్టం అనంతరం ఉస్మానియా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఆదివారం బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీలో అమ్మమ్మ విజయలక్మి, తాతయ్య సురేంద్రనాథ్‌ల నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే తండ్రి, అమ్మమ్మ, తాతయ్యలకు ఒక్కసారిగా దుఃఖ కట్టలు తెంచుకుంది. నిర్జీవంగా పడివున్న రమ్యను చూసి బోరుమన్నారు. ఇదే ప్రమాదంలో గాయపడ్డ తల్లీ రాధిక మంచంపై కదలలేని స్థితిలో ఉంది. పక్కనే ఉన్న కూతురి మృతదేహాన్ని చూస్తూ కన్నీరుపెట్టుకున్న ఆమె ను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కూతురి మృతదేహం ఒక పక్క, గాయపడి కదలేని స్థితిలో భార్య మరోపక్క ఉండటంతో వెంకటరమణ పరిస్థితి వర్ణనాతీతం. అంతేకాకుండా ఆయన సోదరుడు రాజేష్ ఘటనా స్థలంలోనే మృతితో శోకసంద్రంలో ఉన్న ఆ కుటుంబాన్ని చిన్నారి రమ్య మృతి మరింత కృంగదీసింది. బంధు, మిత్రుల సందర్శన అనంతరం చిన్నారి రమ్య మృతదేహాన్ని అంబర్‌పేట శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి రమ్య కుటుంబసభ్యులను పరామర్శించి, సంతాపం తెలియజేశారు.
దురదృష్టకరం : మంత్రి తలసాని
గన్‌ఫౌండ్రీ: బంజారాహిల్స్ జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారి రమ్య మృతదేహానికి ఆదివారం ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ఉస్మానియాకు వచ్చి రమ్య బంధువులను పరామర్శించారు.