ఓయూసెట్‌కు ఆధార్ తప్పనిసరి
♦ దరఖాస్తు విధానంలో సమూల మార్పులు
♦ నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
♦ జూన్ మొదటి వారం నుంచి ప్రవేశ పరీక్షలు
హైదరాబాద్: ఇకపై ఓయూ సెట్‌కు ఆధార్ నంబర్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఆన్‌లైన్ దరఖాస్తులు నేటి నుంచి స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డెరైక్టర్ ఓయూసెట్-2016 వివరాలను వెల్లడించారు. www.ouadmissions.com / www.osmania.ac.in అనే వెబ్‌సైట్ ద్వారా మే నెల 7 వరకు, రూ.500 అపరాధ రుసుముతో 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వివరించారు.
ఓయూతో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలలోని పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. స్టాటిస్టిక్స్ కోర్సులో ప్రవేశానికి ఎమ్మెస్సీ మ్యాథ్స్ నుంచి విడిదీసి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థి దరఖాస్తు ఫారంలో ఆధార్ నంబర్ తప్పకుండా రాయాలన్నారు. ప్రవేశ పరీక్షలో అక్రమాలు అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.
దరఖాస్తులో తాజా ఫొటో మాత్రమే వాడాలి
ప్రతి విద్యార్థి తను తాజాగా తీసిన కలర్ పాస్‌ఫొటో మాత్రమే వాడాలన్నారు. ఓయూ సెట్ దరఖాస్తులో వినియోగించే ఫొటోను బహుళ ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు. అడ్మిషన్స్ కౌన్సెలింగ్, గుర్తింపు కార్డు, లైబ్రరీ కార్డు, హాస్టల్ ప్రవేశాలు, ఉపకార వేతనాల దరఖాస్తులు, సెమిస్టర్ పరీక్షలకు, డిగ్రీ పట్టా సర్టిఫికెట్ల తదితర అవసరాలకు ఓయూ సెట్‌లో వాడిన ఫొటోను ఉపయోగించనున్నట్లు గోపాల్‌రెడ్డి చెప్పారు. ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు కులం, వికలాంగ సర్టిఫికెట్లను స్కాన్‌చేసి పంపించాలన్నారు.
అభ్యర్థులు తమ సొంత సెల్‌ఫోన్ నంబర్, సొంత ఈ-మెయిల్ ఐడీని మాత్రమే దరఖాస్తులో వాడాలని సూచించారు. ప్రతి సమాచారాన్ని అభ్యర్థుల సెల్‌ఫోన్‌కు, ఈ-మెయిల్ ఐడీకి పంపించనున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పంపిన తరువాత ప్రింట్‌ను భద్రపరుచుకోవాలన్నారు. ఒక్క దరఖాస్తు రిజిస్ట్రేషన్‌లో నాలుగు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. జూన్ మొదటి వారంలో ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ డెరైక్టర్లు ప్రొ.కిషన్, ప్రొ.సంపత్‌కుమార్, ప్రొ.నిర్మల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.