
ఓయూకు ఎంతో చేశా..
వీసీగా మూడేళ్లలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఎంతో చేశానని, రెండో సారి అవకాశమిస్తే ఇంకా చేస్తానని ప్రొ.సత్యనారాయణ తెలిపారు.
రెండోసారి అవకాశం ఇస్తే ఇంకా చేస్తాను: వీసీ
ఉస్మానియా యూనివర్సిటీ: వీసీగా మూడేళ్లలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఎంతో చేశానని, రెండో సారి అవకాశమిస్తే ఇంకా చేస్తానని ప్రొ.సత్యనారాయణ తెలిపారు. మూడేళ్ల పాలన ముగిసిన సందర్భంగా ఆదివారం ఓయూ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. విశ్వవిద్యాలయంలో మూడేళ్లుగా జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. హాస్టల్ భవనాలతో పాటు మొత్తం 28 కొత్త భవనాలను నిర్మించానన్నారు. వివిధ ఉద్యోగాల పోటీ పరీక్షలకు చదవుకునే విద్యార్థుల కోసం 24 గంటల లైబ్రరీ కోసం ప్రత్యేక భవనం, సైన్స్ పరిశోధనలకు మరో భవనాన్ని నిర్మించామన్నారు. 1100 మంది విద్యార్థులు పీహెచ్‌డీ డాక్టరేట్ డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలు పొందారన్నారు. నిధులు కొరత ఉన్నా సిబ్బంది వేతనాలకు, ఫించన్ల చెల్లింపులో ఆలస్యం చేయలేదన్నారు. రానున్న రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందన్నారు. వచ్చే మూడు నెలలు వేతనాలు, ఫించన్లు చెల్లింపు కష్టతరమే అన్నారు. అయినా తనకు రెండోసారి అవకాశం ఇస్తే వర్సిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు.
ఐదేళ్ల ఎంటెక్ ఇంటిగ్రేటెట్ కోర్సు
ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో వచ్చే విద్య సంవత్సరం నుంచి ఎంటెక్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెట్ కోర్సును ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వీసీ చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన ఈ కోర్సు ద్వారా ఏటా రూ. 40 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. టెక్నాలజీ కాలేజీలో ఎంటెక్‌లో కొత్తగా ఫుడ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత మెదక్ జిల్లా నర్సాపూర్, జోగిపేటలో త్వరలో పీజీ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. టెక్నాలజీ కాలేజీలోనే ఫార్మసీ కోర్సు కోసం ఆధునిక సదుపాయాలతో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 170 అధ్యాపక ఉద్యోగాల పోస్టులను భర్తీ చేశామని, తాజాగా 43 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశామన్నారు.
ఔటాకు సవాల్
ప్రొఫెసర్ పొస్టుకు అనర్హులైన కొందరు అధ్యాపకులు తనపై విమర్శలు చేయడం దారుణమని వీసీ సత్యనారాయణ అన్నారు. తన వల్ల న్యాక్ ద్వారా ఓయూకు లభించే నిధులు ఆగిపోతే నేను ఉద్యోగ విరమణ చేసిన అనంతరం లభించే పింఛను జీవితాంతం తీసుకోనని ఔటా నాయకులకు వీసీ సవాల్ విసిరారు. విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ ప్రతాప్‌రెడ్డి, ఓఎస్‌డీ నాగేశ్వర్‌రావు, ఏపీసెట్ సభ్య కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.