జస్ట్ మిస్! | Air accidents | Sakshi
Sakshi News home page

జస్ట్ మిస్!

Published Mon, Apr 11 2016 8:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

జస్ట్ మిస్!

జస్ట్ మిస్!

ఎనిమిదేళ్లలో మూడు ‘విమాన ప్రమాదాలు’
2008 సిస్నా... 2010 కిరణ్... ఇప్పుడు ‘బస్’
ప్రతి ఉదంతంలోనూ తప్పిన పెనుముప్పు

సిటీబ్యూరో: రాజధానిలో గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో మూడు విమాన సంబంధిత ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిలో రెండు ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్స్ కాగా... తాజాగా జరిగింది ట్రైనింగ్ కోసం తీసుకువెళ్తున్న విమానం. 2008 సెప్టెంబర్ 8న సనత్‌నగర్ ప్రాంతంలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్నా-150 కుప్పకూలింది. 2010 మార్చి 3న ఏవియేషన్ షో నేపథ్యంలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ కిరణ్ ఎంకే-2 న్యూబోయిన్‌పల్లిలోని భ వనంలోకి దూసుకుపోయింది. ఆదివారం బేగంపేట ఎయిర్‌పోర్ట్ వెనుక వైపు ఎయిర్ ఇండియాకు చెందిన, మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న 320 ఎయిర్ బస్ శిక్షణ కోసం క్రేన్లతో తరలిస్తుండగా ‘కూలిపోయింది’.  మొదటి రెండు ఉదంతాల్లో పెను ప్రమాదాలు  తృటిలో తప్పగా... తాజా ఉదంతంలో ముందు జాగ్రత్త ఫలితంగా గట్టెక్కారు.

 
జనావాసాల్లో కూలినవి రెండు...

నగర శివార్లలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ బేస్‌లు, స్టేషన్లకు సంబంధించిన మిగ్ తదితర విమానాలు అనునిత్యం ప్రమాదాలకు లోనవుతూనే ఉన్నాయి. అయితే జనావాసాల మధ్య మాత్రం ఇప్పటికి రెండు ఎయిర్ క్రాఫ్ట్‌లు కూలాయి. ఈ ఉదంతాల్లో వాటికి సంబంధించిన వారే నలుగురు చనిపోయారు. ఈ రెండుసార్లూ సాధారణ పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు ప్రమాదాలు ఉదయం పూటే జరిగాయి. సంజీవరెడ్డినగర్‌లో 2008 సెప్టెంబరు 8 ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఓ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరిని బలి తీసుకుంది. విమానంలో శిక్షకుడిగా ఉన్న కెప్టెన్ నీరజ్ జైన్, ట్రైనీ పెలైట్ పి.శ్రీనివాస్ మరణించారు. మరో ఇద్దరు స్థానికులకు తీవ్ర గాయాలయ్యాయి. బేగంపేటలోని ఆంధ్ర ప్రదేశ్ ఏవియేషన్ అకాడమీలో భాగమైన ఏరో క్లబ్ ఆఫ్ ఇండియాకు సంస్థకు చెందిన సిస్నా-152 రకం శిక్షణ విమానంలో నీరజ్, శ్రీనివాస్ ఉదయం 10.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్నారు. విమానం గాల్లోకి ఎగిరిన ఐదు నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తడంతో సంజీవరెడ్డినగర్ పరిధిలోని అశోక్‌నగర్ కాలనీ, లింగయ్యనగర్ ల మధ్య ఓ ఇంటిపై కూలిపోయింది. ఆపై 2010 మార్చి 3న విన్యాసాలకు ప్రత్యేకంగా వినియోగించే నేవీకి చెందిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కిరణ్ ఎంకే-2 న్యూబోయిన్‌పల్లిలోని పెద్ద తోకకట్ట వద్ద ఉన్న రెండతస్థుల భవనంలోకి దూసుకుపోయింది. ఇది ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ అయినప్పటికీ అప్పట్లో నేవీలో విన్యాసాల ప్రదర్శనకు వాడుతున్నారు. ఈ ఘటనలో పెలై ట్‌గా ఉన్న లెఫ్టనెంట్ కమాండర్ ఎస్‌కే మౌర్య, కో-పెలైట్‌గా ఉన్న రాహుల్ నాయర్ మృతిచెందారు. భవనంలో నివసించే విజయేశ్వరి, శ్యామ్ గాయాలపాలయ్యారు.

 
తరలింపుల్లో ‘రోడ్డెక్కిన’ ఎయిర్‌బస్...

బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన 320 ఎయిర్ బస్ అనే భారీ విమానం మూడేళ్లుగా నిరుపయోగంగా పడుంది. సీట్లు, ఇంజన్ లేకుండా బాడీగా మిగిలిన ఈ విమానాన్ని బోయిన్‌పల్లి ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డు మీదుగా ఎయిర్ ఇండియాకు చెందిన సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (సీటీఐ)కు తీసుకవెళ్లేందుకు అధికారులు ఆదివారం ప్రయత్నించారు. శిక్షణలో ఉన్న సిబ్బందికి తలుపులు/ పెలైట్లు కూర్చునే కాక్‌పిట్ నిర్వహణ, అత్యవసర సమయాల్లో ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సినజాగ్రత్తలపై శిక్షణ ఇవ్వడానికి ఉపక్రమించారు. ఆదివారం ఉదయం తరలింపు ప్రారంభించిన పది నిమిషాల్లోనే విమానాన్ని మోస్తున్న క్రేన్ కుప్పకూలింది. ప్రహరీగోడపై విమానం పడటం, దానిపై క్రేన్ పడటంతో విహంగం రెండు ముక్కలైంది.

 
తప్పిన పెను ప్రమాదాలు...

2008, 2010ల్లో జరిగిన ఉదంతాల్లోనూ తృటిలో భారీ ప్రాణనష్టం తప్పింది. సంజీవ్‌రెడ్డినగర్‌లో సిస్నా-152 కూలింది సెప్టెంబరు నెలలో. ఈ సమయంలో గణేష్ ఉత్సవాలు జరుగుతుండటంతో అక్కడున్న గణేష్ మండపాలు, ఆ సమయంలో ఉన్న పవర్‌కట్ ప్రాణనష్టాన్ని నివారించాయి. మరమ్మతుల కోసమని ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు అధికారులు ముందే ప్రకటించారు. 10.50 గంటల సమయంలో విమానం నేలకూలే ముందు ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో అది విరిగి వైర్లు తెగి జనావాసాల మీద పడ్డాయి. అదృష్ట వశాత్తూ అప్పటికే విద్యుత్ సరఫరా నిలిపేయడంతో పెనుప్రమాదం తప్పింది. మరోవైపు విమానం కూలిన ప్రాంతానికి సమీపంలో ఉన్న అశోక్‌నగర్ కాలనీ, లింగయ్య నగర్‌ల మధ్యలో ఉన్న రహదారి ఎప్పుడూ స్థానికుల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అయితే ఆ సమయంలో అక్కడ గణేష్ ఉత్సవాల నేపథ్యంలో వినాయకుని మండపాన్ని ఏర్పాటు చేయడంతో రాకపోకలు వేరే రోడ్డునుంచి సాగుతున్నారుు. ఫలితంగా వాహన చోదకులూ మరణించలేదు. ఇక కిరణ్ ఎంకే-2 విషయంలోనూ తృటిలో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రమాద స్థలికి కాస్త దూరంలోనే 400 మంది పిల్లలు చదివే పాఠశాల ఉంది. విమానం అటు వైపు వెళ్లలేదు. మరోపక్క దూసుకుపోయిన భవనం రెండో అంతస్థులోనూ నాలుగు కుటుంబాలు నివసిస్తుండగా పనిదినం కావడంతో మూడిళ్లకు తాళం పడింది. మిగిలిన ఒక్క ఇంట్లో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. ఈ ఇంటి పైన ఉన్న వాటర్‌ట్యాంక్ పగిలి నీరు రావడం వల్ల విమానంలోని ఫ్యూయల్ అంటుకోలేదు.

 
తాజాగా అధికారుల చర్యలతో..
.
ఆదివారం నాటి ఉదంతంలో అధికారులు తీసుకున్న చర్య లు, ముందు జాగ్రత్తల నేపథ్యంలో ప్రాణనష్టం తప్పింది. ఎయిర్‌బస్‌ను తరలించేందుకు అధికారులు మూడు రోజులుగా కసరత్తు చేశారు. విద్యుత్, పోలీసు విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. శనివారం రాత్రి 11.30 గంటల నుంచే ఓల్డ్ ఎయిర్‌పోర్టు మీదుగా వాహనాల రాకపోకలను ఆపేశారు. విమాన తరలింపు జరుగుతున్న ప్రదేశానికి కిలోమీటరు పరిధిలో పాదచారులనూ రానివ్వలేదు. ఈ చర్యల ఫలితంగానే ప్రాణనష్టం తప్పింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement