
గాలితో నడిచే కారు
పెట్రోలియం, డీజిల్, గ్యాస్, సోలార్‌తో నడిచే కార్లను చూశాం.. కానీ సికింద్రాబాద్‌లోని స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ)కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు గాలితో నడిచే కారును రూపొందించి అద్భుతాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్: పెట్రోలియం, డీజిల్, గ్యాస్, సోలార్‌తో నడిచే కార్లను చూశాం.. కానీ సికింద్రాబాద్‌లోని స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ)కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు గాలితో నడిచే కారును రూపొందించి అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఈ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న రమేష్ వికాస్, బీ శ్రీకర్ గౌర్, భార్గవ్, లలిత్ సింగ్‌లు కలసి అసిస్టెంట్ ప్రొఫెసర్లు రామకృష్ణ, రాజేష్, నిఖితల సహకారంతో తమ ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించారు.
గాలికి తిరిగే టర్బైన్ ప్లేట్లు, 12 ప్లస్ 12 ఓల్ట్స్ 35 ఏఎంపీఎస్ రెండు బ్యాటరీలు, రెండు పీఎండీసీ మోటర్స్, రెండు వీల్స్‌తో కేవలం రూ.30 వేలు ఖర్చు చేసి దీన్ని రూపొందించడం గమనార్హం. పెట్రోలు పోయించాలనే బాధలేదు, వాతావరణ కాలుష్యం ఉండదు, 24 గంటలు వీచే గాలి ఉంటే చాలు. దీంతో ఉత్పత్తి అయిన శక్తిని బ్యాటరీలో స్టోర్ చేసుకుంటుంది. బ్యాటరీ నుంచి పీఎండీసీ మోటార్‌కు అనుసంధానించడంతో కారు ముందుకు వెళుతుంది.
ప్రయాణిస్తుంటే బ్యాటరీలోని శక్తి అయిపోతున్నా గాలికి తిరిగే టర్బైన్లతో మళ్లీ శక్తిని నింపుకుంటుంది. గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ వాహనం ఇంకా అభివృద్ధి చేస్తే మరింత వేగంతో ప్రయాణించవచ్చని చెప్పారు ప్రాజెక్టు రూపకర్తల్లో ఒకరైన భార్గవ్. నానో కారు రూ.లక్షకు తయారు చేస్తే ఈ కారును 80 వేల రూపాయలతో అన్ని సౌకర్యాలతో రూపొందించవచ్చని అంటున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, ఎడారిలో నివసించే వారికి మరింత అనుగుణంగా ఉంటుందని అన్నారు మరో విద్యార్థి రమేష్ వికాస్.