అంతర్గత భద్రత నిర్వహణే సవాల్
* ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో అజిత్ దోవల్
* ఈ సమస్యను పోలీసులే పోరాడి గెలవగలరని వ్యాఖ్య
* ఆత్మప్రబోధానుసారం నడుచుకోవాలని సూచన
* గౌరవ వందనం స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితుల కారణంగా యుద్ధరీతులు మారుతున్నాయని... ఈ తరుణంలో అంతర్గత భద్రత నిర్వహణే దేశానికి పెను సవాల్‌గా నిలవనుందని జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో జరిగిన 67 ఆర్‌ఆర్ (2014) బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొత్తం 156 మంది ట్రైనీల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 28 మంది మహిళలు సహా 141 మంది ఐపీఎస్ ట్రైనీలు, 15 మంది విదేశీ ట్రైనీలు ఉన్నారు. ఈ సందర్భంగా దోవల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అంతర్గత భద్రత పెనుసవాళ్లను విసురుతోందని, దీన్ని అదుపు చేయలేని దేశాలు చీలుతున్నాయన్నారు. పౌర సమాజంలో జరిగే ఇంతటి కీలక సమస్యను పోలీసులు మాత్రమే పోరాడి గెలవగలరని దోవల్ వ్యాఖ్యానించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, ముఖ్యంగా సైబర్ క్రైం పెనుసవాళ్లు విసురుతోందన్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని దోవల్ సూచించారు. ఈ సందర్భంగా గౌతమబుద్ధుడు పేర్కొన్న 'ఆత్మ దిపోభవ'ను దోవల్ ప్రస్తావించారు. ట్రైనీ ఐపీఎస్‌లకు సమర్థ శిక్షణ అందించిన అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణను దోవల్ అభినందించారు.
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌ను నిర్వహించడం గర్వకారణమన్నారు. అంతకు ముందు ఎన్‌పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ మాట్లాడుతూ... ట్రైనీ ఐపీఎస్‌లకు ఇచ్చిన శిక్షణ తీరును వివరించారు. ఉత్తమ ఆల్‌రౌండ్ ప్రొబేషనర్‌గా నిలిచిన గుజరాత్ ట్రైనీ ఐపీఎస్ పార్థ్‌రాజ్‌సిన్హ్ ఎన్. గోహిల్‌కు ప్రధాన మంత్రి బాటన్, హోంమంత్రి రివాల్వర్‌లను దోవల్ ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరచిన మరికొందరికి కూడా అవార్డులను అందించారు.