గ్రేటర్ సిద్ధం | all set for ghmc elections | Sakshi
Sakshi News home page

గ్రేటర్ సిద్ధం

Published Tue, Mar 11 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

గ్రేటర్ సిద్ధం

గ్రేటర్ సిద్ధం

ఎన్నికలకు భారీ ఏర్పాట్లు
 అధికారుల కసరత్తు
 1400 మందికి    ఓ పోలింగ్ బూత్
 వీడియో బృందాల ఏర్పాటు
 ప్రభుత్వోద్యోగులే బీఎల్‌వోలు
 తొలిసారిగా నోటా అమలు
 త్వరలో ఫొటో ఓటరు స్లిప్‌ల పంపిణీ

 
 సాక్షి, సిటీబ్యూరో :
 గ్రేటర్‌లో సార్వత్రిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ‘గ్రేటర్’లో ఏప్రిల్ 30న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా, బోగస్‌ల ఏరివేత, అవసరమైన పోలింగ్‌స్టేషన్లు, ఈవీఎంలు, ఎన్నికల నిర్వహణకు తగినంతమంది సిబ్బంది, వీటన్నింటితో పాటు ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు మునిగారు. మరోవైపు ఎన్నికల్లో అక్రమాలు నిరోధించేందుకు, ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని అరికట్టేందుకు సర్వ సరంజామాతో సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈసారి ప్రత్యేకంగా వీడియో బృందాలు.. పెయిడ్ న్యూస్ నిరోధానికి కమిటీలు తదితరమైనవి ఏర్పాటు చేశారు.
 
  హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు.. చేయనున్న ఏర్పాట్లు.. కల్పిస్తున్న సదుపాయాలు తదితరమైన వాటి గురించి అడిషనల్ ఎలక్షన్ ఆఫీసర్ , జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి.. జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ రాహుల్ బొజ్జా వివరించారు. మంగళవారం జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ప్రస్తుతానికి 3091 పోలింగ్‌కేంద్రాలు అవసరమని భావిస్తున్నామన్నారు. వాటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతోపాటు విద్యుత్, తాగునీరు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. తుది జాబితా నాటికి ఓటర్ల సంఖ్య పెరగనున్నందున అందుకనుగుణంగా 1400 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌బూత్ చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. బూత్‌లెవెల్ అధికారులుగా ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే నియమిస్తామన్నారు. అక్రమాలు నిరోధించేందుకు, డబ్బు ప్రభావాన్ని అరికట్టేందుకు వ్యయపరిశీలకుల తో పాటు వీడియో నిఘా బృందాలు తదితరమైనవి ఏర్పాటు చేశామన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు జీహెచ్‌ఎంసీలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై సుమోటోగానూ, ఫిర్యాదుల ఆధారంగానూ కేసులు నమోదు చేస్తామన్నారు. వీటికి సంబంధించిన నివేదికలు ఏరోజుకారోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు పంపిస్తామన్నారు.
 
 ఉల్లంఘనలపై కఠిన చర్యలు
 అక్రమ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలకు సంబంధించి కఠినచర్యలు తీసుకుంటామన్నారు. వీటికి సంబంధించి తొలిదశలో వాటిని తొలగించడం.. తదుపరి పెనాల్టీలు, నోటీసులు, ఆపై వ్యక్తిగత, పార్టీ ఖాతాలో ఎన్నికల ఖర్చుగా చూపిస్తామన్నారు. పోలింగ్ తీరును గుర్తించేందుకు, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ‘వెబ్‌క్యాస్టింగ్’ను వినియోగిస్తామన్నారు. ఇందులో వినియోగించే వెబ్‌కెమెరాల ద్వారా కార్యాలయాల్లోని ఉన్నతాధికారులు సైతం ఆయా పోలింగ్ కేంద్రాలను వీక్షించవచ్చన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి రాజకీయ పార్టీల వారికి ఇప్పటికే వివరించామన్నారు. ఎన్నికల ఖర్చును లెక్కించడానికి వీడియో నిఘా బృందాలు, వీడియోలు పరిశీలించే బృందాలు, ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు, తదితర బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పలు అంశాల గురించి వివరించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్(ఎన్నికలు) శివపార్వతి పాల్గొన్నారు.
 
 అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేసే బృందాలివీ..
 వీడియో సర్వైలెన్స్ టీమ్: టీమ్‌కు ఒక అధికారి, ఒక వీడియోగ్రాఫర్
 వీడియో వ్యూయింగ్ టీమ్: టీమ్‌కు ఒక అధికారి, ఇద్దరు క్లర్కులు
 అకౌంటింగ్ టీమ్: టీమ్‌కు ఒక అధికారి, ఒక క్లర్కు ఫ్లయింగ్ స్క్వాడ్స్: ఒక్కో నియోజకవర్గానికి మూడు టీమ్‌లు. ఒక్కో టీమ్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, సీనియర్ పోలీస్ ఆఫీసర్, వీడియోగ్రాఫర్, నలుగురు సాయుధ పోలీసులు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్: ఒక్కో నియోజకవర్గానికి మూడు టీమ్‌లు. టీమ్‌కు ఒక మేజిస్ట్రేట్, నలుగురు పోలీసు అధికారులు
 
     ఎంసీసీసీ టీమ్స్ : టీమ్‌కు ఒక సివిల్ ఆఫీసర్, పోలీసు ఆఫీసర్, వీడియోగ్రాఫర్
     సహాయ వ్యయ పరిశీలకుడు: అసెంబ్లీకే కాదు పార్లమెంటు నియోజకవర్గాలకూ ఉంటారు.
 
     మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ : ఇందులో జిల్లా ఎన్నికల అధికారి అయిన జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్, ఖైరతాబాద్ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అయిన సెంట్రల్ జోన్ కమిషనర్, ఆలిండియా రేడియో ప్రతినిధి, మీడియా ప్రతినిధి, జీహెచ్‌ఎంసీ సీపీఆర్‌వో సభ్యులు.
 
     హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అయిన హైదరాబాద్ జిల్లా ఆర్‌డీఓ సభ్యులు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అయిన హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అయిన హెచ్‌ఎండీఏ సెక్రటరీ సభ్యులు.
 
 ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌సెంటర్ నెంబరు (040-21 11 11 11) ఇది 24 గంటలు పనిచేస్తుంది. దీనికి ఇన్‌ఛార్జిగా జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్, ఐటీ) డి.జయరాజ్ కెన్నెడి, కోఆర్డినేటింగ్ అధికారిగా రవాణా విభాగం సూపరింటెండెంట్ కె. మహేశ్ కులకర్ణి బాధ్యతలు నిర్వహిస్తారు. వీరితోపాటు షిఫ్టుల వారీగా ఇతర సిబ్బంది పనిచేస్తారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 040-23302440, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు 155304 నెంబర్లలో కూడా సంప్రదించవచ్చు. ఫ్యాక్స్ నెంబరు 040- 23264068.
 
 
 జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు    15
 పార్లమెంటు నియోజకవ ర్గాలు    2
 ప్రస్తుత పోలింగ్‌కేంద్రాలు    3091
 ఎన్నికల నోటిఫికేషన్    ఏప్రిల్ 2
 పోలింగ్    ఏప్రిల్ 30
 ఓట్ల లెక్కింపు    మే 16
 ఎన్నికల ముగింపు    మే 28
 
 వ్యయ పరిమితి
 అభ్యర్థి    గరిష్ట పరిమితి
 లోక్‌సభ అభ్యర్థి    రూ. 70 లక్షలు
 అసెంబ్లీ అభ్యర్థి    రూ. 28 లక్షలు
 
 వివిధ బృందాల బాధ్యులు వీరే
 బృందం అధికారివ్యయ పరిశీలక బృందం నోడల్ అధికారి విజయకుమారి, జీహెచ్‌ఎంసీ సీఎఫ్‌ఓవీడియో సర్వైలెన్స్ టీమ్స్ జిల్లా ఇన్‌ఛార్జి    శ్రీనివాసరావు, సీసీపీ వీడియో వ్యూయింగ్ టీమ్ జిల్లాస్థాయి ఇన్‌ఛార్జి ఫణిశ్యామ్, విద్యుత్ విభాగం డీఏఓ అకౌంటింగ్ టీమ్స్ జిల్లాస్థాయి ఇన్‌ఛార్జి నీరజ, జీహెచ్‌ఎంసీ డీఏఓ ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ జిల్లా ఇన్‌ఛార్జి
 ఎం. భాస్కర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విభాగం ఏఎస్‌పీ
 
 ఫొటో ఓటరు స్లిప్‌లు
 ఈసారి ఓటర్లకు ఓటరు జాబితాలో వారి పేరు, పోలింగ్ కేంద్రం, క్రమసంఖ్య వివరాలు తెలియజేసే ఓటరు స్లిప్‌లను బూత్‌లెవెల్ అధికారులే ప్రజల ఇళ్లకు వెళ్లి అందజేస్తారు. ఇవి ఫొటోలతో కూడి ఉంటాయి. వీటినే ఓటరు గుర్తింపు పత్రాలుగా కూడా గుర్తిస్తారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వీటిని పంపిణీ చేస్తారు.
 
 నోటా
 ఎనికల బరిలో నిలిచిన అభ్యర్థులతోపాటు పైవారిలో ఎవరికీ కాదు (నోటా) ఆప్షన్ కూడా ఈవీఎంలలో ఉంది. ప్రజలకు దీనిపై కూడా అవగాహన కల్పిస్తారు. అవసరాలకనుగుణంగా దాదాపు 16000 ఈవీఎంలను అందుబాటులో ఉంచారు.
 
 ఇంకా గడువుంది
 ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఇంకా గడువుంది. ఈనెలాఖరులోగా దరఖాస్తు చేసుకుంటేనే ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుంటుంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఓటరు కార్డులు అందజేస్తారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారిలో దాదాపు లక్షా65వేల మందికి ఇంకా ఓటరు కార్డులు అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement