సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. శుక్రవారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులకు రుణమాఫీని ఒకే విడతలో పూర్తి చేయాలని, పంట లకు నష్టపరిహారం కూడా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో యాభై సంవత్సరాలకు పైబడిన రైతులందరికీ కరువు పెన్షన్ ఇవ్వాలన్నారు. మిషన్ కాకతీయలో యాభైశాతం పనులను ఉపాధి కూలీలకు ఇవ్వడం వల్ల పల్లెల్లో పేదల బతుకులకు ఎంతో మేలుచేసినట్లవుతుందని అన్నారు. కాగా, రబీ పంటలపై వెంటనే సర్వేచేయిస్తామని రాజీవ్ శర్మ తెలిపారన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య ను కూడా సీఎస్ పెంచుతామన్నారని చాడ వెల్లడించారు.