13 రాష్ట్రాలు కరువును ఎదుర్కొంటున్నాయి
13 రాష్ట్రాలు కరువును ఎదుర్కొంటున్నాయి
Published Mon, Aug 8 2016 10:28 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టౌన్ :
వరుస కరువుతో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయి వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేక పట్టణాలకు వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు తిరునవక్కరసు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, సుమారు 53 కోట్ల ప్రజలు కరువుతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కరువులో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహాయ సహకారాలను అందించడంలేదని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించి వ్యవసాయ కార్మికులకు ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ బకాయిలపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తెచ్చుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులను మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులకు దారిమళ్లిస్తుందని ఆరోపించారు. దేశ«ంలో 40 కోట్ల మంది ఇళ్లులేక అవస్థలు పడుతున్నారని, వారందరికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. సెప్టెంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు కొండూరు వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకటరాములు, జిల్లా అధ్యక్షుడు ఎం.రాములు, కె.నగేష్, పద్మ, కత్తుల లింగస్వామి, జిల్లా అంజయ్య, పాలడుగు నాగార్జున, వసంతకుమార్, నారి అయిలయ్య పాల్గొన్నారు.
Advertisement