వానమ్మా.. వానమ్మా..ఒక్కసారన్నా...వచ్చిపోవమ్మా...
నల్లగొండ అగ్రికల్చర్ :జిల్లాలో రోజురోజుకూ వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. చినుకు జాడ కనిపించకపోగా, కరువు తరుముకొస్తోంది. వానాకాలంలో కూడా ఎండాకాలాన్ని తలపించే విధంగా వాతావరణంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వానలు లేక బోరుబావులలో నీరు ఇంకిపోతున్నది. విద్యుత్ కోతల కారణంగా వేసిన కొద్దిపాటి వరితోపాటు, పత్తిచేలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. పెట్టిన పెట్టుబడులు వస్తాయో రావోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం 752.6 మిల్లీమీటర్లు కాగా, గత ఖరీఫ్‌లో 1073.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఈసారి ఇప్పటివరకు కేవలం 42.6 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి చూస్తే కనుచూపు మేరల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదు. వరిచేలల్లో నెర్రెలు పారగా, పత్తి చేలు వాడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ అన్నదాతలు ఆకాశంవైపు చూస్తూ ఎండుతున్న పంటలను చూసి గుండెలు బాదుకుంటున్నారు. జిల్లాలో ఖరీఫ్‌సాగు విస్తీర్ణం 4,83,452 హెక్టార్లు కాగా, గత ఖరీఫ్‌లో రికార్డుస్థాయిలో 6,02,799 హెక్టార్లు సాగు అయ్యింది. అయితే ప్రస్తుత కరువు కారణంగా జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 2,92,000 హెక్టార్లలో రైతులు వివిధపంటలను సాగుచేశారు. అంటే కేవలం 61 శాతం మాత్రమే సాగైంది.
వరి 46,639 హెక్టార్లు కాగా, పత్తి 2,22,000 హెక్టార్లలో సాగైంది. మిగతా వివిధ పంటలు సాగుచేశారు. నాన్‌ఆయకట్టు ప్రాంతాలలో సాగుచేసిన వరిపంటలో వర్షాభావ పరిస్థితులకు తోడు విద్యుత్ కోతల కారణంగా సగానికి సగం వరి చేలు నై వారి ఎండిపోతున్నాయి. పత్తి పంటలు కూడా సగానికి పైగా వాడిపోయి ఎర్రబారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సాగైన పంటలు కూడా చేతికి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో అన్నదాతలలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీరే పరిస్థితులు కానరాకపోవడంతో తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏది ఏమైనా వరుణుడు కరుణించి వర్షాలు కురిస్తే తప్ప పంటలు చేతికొచ్చే అవకాశమే లేదు.