మోదీని వ్యతిరేకిస్తే దేశద్రోహులేనా: సురవరం
పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు. నోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రిని బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. నరేంద్ర మోదీని వ్యతిరేకించిన వాళ్లందరినీ దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని.. దీన్ని ఎంత మాత్రం సహించేది లేదని చెప్పారు.
అదానీ, అంబానీలకు వేలకోట్ల రూపాయల రాయితీలను ఎందుకు ఇచ్చారని సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. బ్లాక్ మనీ పేరుతో పేదలను వేధించడం సరికాదని చెప్పారు. నల్లధనంలో కేవలం 6 శాతం మాత్రమే దేశంలో ఉందని, మిగిలినదంతా విదేశాల్లో ఎప్పుడో దాచేశారని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని, రిటైల్ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. కూరగాయలు అమ్ముకునే వారు, హెయిర్ కటింగ్ సెలూన్ల వారు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆరు నెలలు గడిచినా ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదన్నారు. జీడీపీ వృద్ధిరేటు 3.5 శాతానికి పడిపోయిందన్నారు. పాత కరెన్సీని మరికొంత కాలం అనుమతిస్తేనే గ్రామీణ పరిస్థితులు మెరుగుపడతాయని సురవరం చెప్పారు.