ప్రధాని మోదీ కొత్తడ్రామాకు తెరలేపారు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని, రోజుకో నిబంధన పేరుతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలను హైదరాబాద్లోని ముగ్ధుం భవన్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అపరిపక్వతతో నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. సీనియారిటీ, నిబంధనలు పాటించకుండా ఆర్మీ, సీబీఐ, రా చీఫ్లను నియమిస్తున్నారని విమర్శించారు. దేశంలో గోహత్య పేరుతో దళితులపై దాడులు జరిగాయని అన్నారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాలని సురవరం అన్నారు.
మూడు రోజుల పాటు జరగనున్న జాతీయ కౌన్సిల్ సమావేశాలలో వివిధ రాష్ట్రాల నుంచి 125 మంది ప్రతినిధులు పాల్గొంటారు. నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, దళితులు-మైనారీటీలపై దాడులు, తాజా రాజకీయ, ఆర్దిక పరిస్థితులపై చర్చిస్తారు. ఫెడరల్ క్యాస్ట్రో, జయలలిత, సీపీఐలో వివిధ హోదాల్లో పనిచేసి చనిపోయిన కామ్రేడ్లకు ఎంపీ డి.రాజా సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు.