'నోట్ల రద్దు ఎత్తుగడ బెడిసికొట్టింది'
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రక్రియతో ఎంతమేర నల్లధనం బయటకు వచ్చిందో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత యాభై రోజులు ఓపిక పడితే మంచిరోజులు చూపిస్తానన్న మోదీ.. ఎలాంటి మార్పు తీసుకువచ్చారో తెలియజేయాలన్నారు.
‘మంచిరోజుల సంగతి అటుంచితే, సగటు జీవి బ్యాంకు ఖాతాలో వేసిన నగదు ఎన్నిరోజుల్లో బయటకు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఎన్నిరోజుల్లో ఇచ్చేస్తారు’ అని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం మక్దూం భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పెద్ద నోట్ల రద్దుతో సాధారణ ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆర్థిక రంగం సంక్షోభంలో పడింది. డిసెంబర్ 31న ప్రధాని ప్రసంగంలో నోట్ల రద్దుకు సంబంధించిన అంశాలు, నష్ట నివారణ చర్యల ఊసేలేదు. ఆ ప్రసంగం ఆయనలోని అసంతృప్తిని వ్యక్తం చేసింది. అవసరమైన ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా తప్పించుకుంటున్నారు. కీలక అంశాలు తప్ప ఇతర అంశాలన్నీ మాట్లాడారు. ఎందుకంటే నోట్ల రద్దు ఎత్తుగడ పూర్తిగా బెడిసికొట్టింది’ అని సురవరం ఎద్దేవా చేశారు.
చేసిన తప్పును అంగీకరించి దేశానికి మోదీ క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని పదవి నుంచి మోదీని దించేందుకు ఏ పార్టీ ప్రయత్నించడం లేదని, ఎన్నికలు వచ్చేవరకు ఆయన సీటుకు డోకా లేదని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రోజుకో మాట చెబుతూ, ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తూ మోదీ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మాదిరి రాజకీయాలు అనుకరిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం తీసుకున్న మూర్ఖపు నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చ జరపాలని అన్నారు.