కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారు!
విజయవాడ : పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అవలీలగా అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందిపడటం లేదని వెంకయ్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ పార్లమెంట్ను ఎదుర్కొనే ధైర్యం చేయలేకపోతున్నారని సురవరం అన్నారు. ప్రధాని పార్లమెంట్కు జవాబుదారీ కాదా ? అని ప్రశ్నించారు. విజయ్ మాల్యా, లలిత్ మోదీలు తప్పించుకుంటున్నారు..కానీ, రైతులను మాత్రం ప్రధాని మోదీ టార్గెట్ చేశారన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పడం లేదని స్పష్టం చేశారు. నోట్ల రద్దుతో ఇంకా సంక్షోభం ఏర్పడుతుందని...ప్రజల ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, రైతులు, కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. డిసెంబర్ 30 వరకు పాత నోట్లను అనుమతించాలని సురవరం కోరారు.