మీరంతా చంద్రబాబు అందం చూసి వెళ్లారా? | ambati rambabu dares defected mlas to resign within 24 hours | Sakshi
Sakshi News home page

మీరంతా చంద్రబాబు అందం చూసి వెళ్లారా?

Published Thu, Jun 16 2016 4:39 PM | Last Updated on Sat, Jul 28 2018 6:51 PM

మీరంతా చంద్రబాబు అందం చూసి వెళ్లారా? - Sakshi

మీరంతా చంద్రబాబు అందం చూసి వెళ్లారా?

24 గంటల్లో రాజీనామా చేసి దమ్ముంటే మళ్లీ గెలవండి
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అంబటి రాంబాబు సవాలు
వాళ్లు ఓడిపోతే తెలుగుదేశం పార్టీని మూసేస్తారా
వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు
శోభా నాగిరెడ్డి సహా అందరితో పోటీ చేయించి గెలిపించుకున్నాం
స్క్రిప్టులు ఇచ్చి వాళ్లతో తిట్టిస్తే చంద్రబాబు గొప్పవాడు కాలేడు

హైదరాబాద్

వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి, తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తాము డబ్బులు తీసుకోలేదంటూ కోతలు కోస్తున్నారని.. మరి మీరంతా చంద్రబాబు అందం చూసి వెళ్లారా, ఆయన పాలన చూసి వెళ్లారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చని, కానీ అది వద్దనుకుంటే విడాకులు ఇచ్చిన తర్వాత మాత్రమే మరో పెళ్లి చేసుకోవాలని.. అలా కాకుండా, విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకుంటే చట్టం ఒప్పుకొంటుందా అని ప్రశ్నించారు. పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలు 24 గంటలలోగా తమ పదవులకు రాజీనామా చేసి సైకిల్ గుర్తుపై పోటీ చేసి గెలవాలని సవాలు చేశారు. తాము గెలిస్తే పార్టీ మూసేసుకుంటారా అని ఆ ఎమ్మెల్యేలు ప్రశ్నించారని.. వాళ్లు ఓడిపోతే టీడీపీని మూసేసుకుంటారా అన్న విషయం కూడా చెప్పాలని ఆయన అన్నారు. మీ పేరేంటని అడిగినప్పుడు అవతలి వాళ్ల పేరు కూడా చెప్పాలని గుర్తుచేశారు.

ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఇచ్చి చంద్రబాబు కొన్నారని, ఎంతమంది వెళ్లినా వైఎస్ఆర్‌సీపీ వన్నె తగ్గకపోగా.. మరింత పెరుగుతోందని చెప్పారు. డబ్బులు, పదవుల కోసం అమ్ముడుపోయిన వాళ్లు జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం తగదని, ఆయన గురించి అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్నమాట నిలబెట్టుకోవడం కోసం పదవులు వదులుకుని మళ్లీ పోటీచేసిన కుటుంబం వైఎస్ జగన్‌దని.. కమీషన్ల కోసం వెళ్లిన మీకు జగన్ గురించి, వైఎస్ఆర్‌సీపీ గురించి మాట్లాడే హక్కులేదని అన్నారు.

శోభా నాగిరెడ్డి పీఆర్పీలో గెలిచారని, కాంగ్రెస్‌లో ఆ పార్టీని విలీనం చేసినప్పుడు ఆమె వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చారని, ఆమెతోపాటు టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకున్న చరిత్ర తమదని అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివితే చాలదని, డబ్బులు, పదవులకు ఆశపడి వెళ్లిన 20 మంది  సిగ్గు, లజ్జ ఉంటే పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాలు చేశారు. చట్టాల్ని గౌరవించాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. పెళ్లి చేసుకున్న చోట సంసారం చేయాల్సి ఉండి.. మీరా మమ్మల్ని ప్రశ్నించేదని నిలదీశారు. ఏ పార్టీ తరఫున గెలిచారో, ఆ పార్టీ నాయకుడినే విమర్శిస్తారా.. నైతిక విలువలు పాటించాలని హితవు పలికారు. జగన్ చుట్టూ తిరిగి పార్టీ టికెట్ల మీద గెలిచారని, ఇప్పుడు సిగ్గులేకుండా పచ్చ కండువాలు కప్పుకొంటున్నారని విమర్శించారు. ఊరికే స్క్రిప్టులు ఇచ్చి వాళ్లతో తిట్టిస్తే చంద్రబాబు గొప్పవాడు కారని, తాము మేం కోర్టులను, న్యాయస్థానాలను గౌరవిస్తున్నాం కాబట్టే ఇంతకాలం ఊరుకున్నామని అంబటి రాంబాబు చెప్పారు.

ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి గురించి ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదని, మీడియాను కూడా ఏమీ చెప్పనివ్వడం లేదని, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. ఫిబ్రవరి 9న ఆయన నిరాహార దీక్ష విరమించేటప్పుడు కొందరు మంత్రులు ఆయనకు హామీలిచ్చారని, ఆ మంత్రులెవరూ ఇప్పుడు రాజమండ్రి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదని.. ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానాస్పదంగా ఉందని రాంబాబు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement