సచివాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే ఎత్తయిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేయాలని జయంతి ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఇందుకు ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్ వెనుకనున్న 36 ఎకరాల స్థలాన్ని పరిశీలించించింది. అందులోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం బుద్ధపూర్ణిమ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 14న కేసీఆర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
అందుకు తగిన ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులకు ఉత్సవ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ భవన్ స్థానంలో అంబేడ్కర్ టవర్ నిర్మాణాలకూ అదే రోజున శంకుస్థాపన చేయించాలని తీర్మానించారు. అలాగే బోరబండ వద్ద నిర్మించతలపెట్టిన దళిత్ స్డడీస్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం అదే రోజు సాయంత్రం బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి జగదీష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి వెల్లడించారు.
ఘనంగా జయంతి ఉత్సవాలు
అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలను ఏడాది పొడవునా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి చందూలాల్‌తో పాటు టీఎస్‌పీఎస్‌సీసీ చైర్మన్ గంటా చక్రపాణి, తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.