అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారు!
నేడు ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన షెడ్యూల్ దాదాపు ఖరారైంది. పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయి పార్టీ పరిస్థితి, కేంద్రప్రభుత్వ పథకాల అమలు తీరుపై షా పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా 22, 23, 24 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. షా మూడు రోజుల పర్యటన కోసం నల్లగొండ, నిజామాబాద్‌లలో ఒక జిల్లాను రాష్ట్ర బీజేపీ ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే మహబూబ్‌నగర్, భువనగిరి జిల్లాల్లో పర్యటన విషయమై ప్రాథమికంగా పరిశీలించారు. పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణ, ప్రాధాన్యతపై ఓ నివేదికను నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల నాయకులు రాష్ట్ర నాయకత్వానికి సమర్పించినట్లు తెలిసింది.
ఈ ప్రతిపాదనలను ఢిల్లీ పంపించి అక్కడ ఆమోదం పొందాక బుధవారం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అమిత్ షా పర్యటనలో భాగంగా తెలంగాణ సాయుధపోరాటం, రజాకార్ల అరాచకాలు జరిగిన ప్రాంతాలు, నక్సల్స్ చేతుల్లో బీజేపీ నాయకులు హతులైన ప్రాంతాలు చేర్చనున్నారు. 24న పర్యటనను ముగించుకుని చివరిరోజు సాయంత్రం హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో షా పాల్గొంటారు. అదేరోజు రాత్రి విజయవాడకు బయలుదేరి వెళతారు. 25న విజయవాడలో రాష్ట్రస్థాయి కార్యకర్తల సదస్సులో పాల్గొని ఆరోజే ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.